Casagrand: 1,000 మంది ఉద్యోగులకు స్పెయిన్ ట్రిప్ ఆఫర్ చేసిన చెన్నై రియల్ ఎస్టేట్ కంపెనీ

by S Gopi |   ( Updated:2024-11-18 13:10:34.0  )
Casagrand: 1,000 మంది ఉద్యోగులకు స్పెయిన్ ట్రిప్ ఆఫర్ చేసిన చెన్నై రియల్ ఎస్టేట్ కంపెనీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఉద్యోగులకు, వారి పనిని గుర్తించి కంపెనీలు రకరకాల కానుకలతో, ఆఫర్లతో సర్‌ప్రైజ్ చేసే ట్రెండ్ పెరుగుతోంది. స్టార్టప్ కంపెనీల హవా పెరిగిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఈ తరహాలోనే చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ కాసాగ్రాండ్ కూడా తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'ప్రాఫిట్-షేర్ బొనాంజా' కార్యక్రమంలో భాగంగా 1,000 మంది ఉద్యోగులను స్పెయిన్‌లోని బార్సిలోనాకు వారం రోజుల ట్రిప్‌ను ఆఫర్ చేసింది. వారికి ట్రిప్‌లో ఎదురయ్యే అన్ని ఖర్చులను కూడా కంపెనీ భరించనున్నట్టు సోమవారం ప్రకటనలో స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అనుకున్న దానికంటే ఎక్కువ అమ్మకాలను సాధించడంలో ఉద్యోగుల పాత్రను గౌరవిస్తూ, వారి నిబద్దత, సహకారాన్ని గుర్తించి ఈ ఆఫర్ చేసినట్టు కాసాగ్రాండ్ పేర్కొంది. ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలను అందించడం ద్వారా సాంప్రదాయంగా ఇచ్చే బోనస్ లాంటి వాటికి భిన్నంగా వారికి వృత్తిపరమైన సంతృప్తి ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది. కాగా, కాసాగ్రాండ్ తన ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2013 నుంచి ప్రారంభమైన ఈ బొనాంజా తొలినాళ్లలో సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, దుబాయ్, మలేషియా, లండన్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లింది.

Advertisement

Next Story