లాభనష్టాల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!

by srinivas |
లాభనష్టాల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, దేశీయంగా పరిణామాలు స్తబ్దుగా ఉండటంతో సూచీలు వారాంతం ఊగిసలాట ధోరణిలో కదలాడాయి. శుక్రవారం ఉదయం లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత కాసేపటికే నష్టాలకు మారాయి. అనంతరం మదుపర్లు కనిష్ఠాల కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో మిడ్-సెషన్ సమయంలో పుంజుకున్నాయి. అక్కడినుంచి చివరి వరకు లాభనష్టాల మధ్య కదలాడిన తర్వాత చివరికి ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ని ముగించాయి. అమెరికా జాబ్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా వరుసగా మూడవ వారం నష్టాలను చూస్తున్నాయి.

ఈ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 36.74 పాయింట్లు లాభపడి 58,803 వద్ద, నిఫ్టీ 3.35 పాయింట్లు నష్టపోయి 17,539 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, మీడియా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకోగా, పీఎస్‌యూ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకోగా, మారుతీ సుజుకి, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.85 వద్ద ఉంది.

Advertisement

Next Story