భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలకు తోడు త్రైమాసిక ఫలితాల మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. దాంతో గత వారాంతం కోల్పోయిన దాదాపు 700 పాయింట్లను సెన్సెక్స్ తిరిగి సాధించింది. సోమవారం ఉదయం నుంచే మెరుగైన ర్యాలీతో ప్రారంభమైన ట్రేడింగ్ మిడ్-సెషన్ తర్వాత మరింత ఊపందుకుంది.

విదేశీ మదుపర్లు భారత మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. ఇదే సమయంలో విలీన ప్రక్రియ నేపథ్యంలో ఇటీవల పతనమైన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కోలుకోవడం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 709.96 పాయింట్లు ఎగసి 61,764 వద్ద, నిఫ్టీ 195.40 పాయింట్లు లాభపడి 18,264 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు మాత్రమే బలహీనపడ్డాయి. ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోయాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ స్టాక్స్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.79 వద్ద ఉంది.

Advertisement

Next Story