- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Banks: 10 ఏళ్లలో రూ.16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసిన బ్యాంకులు

దిశ, బిజినెస్ బ్యూరో: గత పదేళ్ల కాలంలో దేశీయ బ్యాంకులు రూ. 16.35 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను మాఫీ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలియజేశారు. అత్యధికంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,36,265 కోట్లను రద్దు చేయగా, అత్యల్పంగా 2014-15లో రూ. 58,786 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. 2022-23లో మొత్తం రూ. 2,16,324 కోట్లు, 2023-24లో రూ. 1,70,270 కొట్లను బ్యాంకులు రద్దు చేశాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్యాంకులు నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) రద్దు చేస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఈ రైటాఫ్ ప్రక్రియ కారణంగా రుణ గ్రహీతలకు ప్రయోజనం కల్పించినట్టు కాదని, బ్యాంకులు వివిధ రికవరీ మెకానిజం ద్వారా రుణాలను తిరిగి వసూలు చేసే ప్రక్రియను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ అసెట్స్ సెక్యూరిటీ అండ్ రీకన్‌స్ట్రక్షన్ కింద చర్యలు తీసుకోవడం, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అమలు చేయడం, నేషనల్ బ్యాంక్, కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో కేసులు దాఖలు చేయడం వంటి పద్దతులను చేపడతాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2024, డిసెంబర్ ఆఖరు నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 29 కంపెనీలను ఎన్‌పీఏలుగా గుర్తించాయి. ఇందులోని ఒక్కో కంపెనీ రూ. వెయ్యి కోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. వీటి విలువ రూ. 61,027 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు.