అధిక వడ్డీతో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఎఫ్‌డీ పథకం!

by sudharani |
అధిక వడ్డీతో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఎఫ్‌డీ పథకం!
X

న్యూఢిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల కోసం సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. 'బరోడా తిరంగా' పేరుతో తెచ్చిన ఈ ఎఫ్‌డీ పథకాన్ని రెండు కాలవ్యవధులతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో 444 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై 5.75 శాతం, 555 రోజుల కాలవ్యవధిపై 6 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు బ్యాంకు వెల్లడించిది.

అయితే, ఈ కొత్త ఎఫ్‌డీ పథకం తీసుకోవాలనుకునే వినియోగదారులకు ఆగష్టు 16వ తేదీ నుంచి డిసెంబర్ 31 మధ్య ఇది అమల్లో ఉంటుందని, రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుందని వివరించింది. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లకు ఏడాదికి అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త పథకాన్ని తెచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఇటీవలే ప్రభుత్వం రంగ దిగ్గజం ఎస్‌బీఐ సైతం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఉత్సవ్ డిపాజిట్' పేరుతో ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం తీసుకున్న ఖాతాదారులకు 1000 రోజుల కాలవ్యవధితో 6.10 శాతం అధిక వడ్డీ ఎస్‌బీఐ ఇస్తోంది. ఈ నెల 15 నుంచి 75 రోజుల్లోగా తీసుకున్న వారికి ఇది వర్తించనుండగా, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ అమలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed