రెపో రేటు మరింత పెరగవచ్చు!

by Manoj |
రెపో రేటు మరింత పెరగవచ్చు!
X

ముంబై: దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించకపోవడంతో ఆర్‌బీఐ తన ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారని తెలిపారు. గత నెలలో ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన తర్వాత ఈ సోమ, మంగళవారాల్లో జరిగే సమావేశాల్లో మరో 35 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అంచనా వేశారు. అంతేకాకుండా రానున్న నెలల్లో రెపో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఆర్‌బీఐ గవర్నర్ దాస్ నేతృత్వంలో 6, 7 తేదీల్లో ఎంపీసీ సమావేశం జరగనుంది. భేటీ అనంతరం బుధవారం సమావేశ నిర్ణయాలను గవర్నర్ వెల్లడిస్తారు. ఆర్‌బీఐ అంచనాలకు మించి ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా నమోదైంది. ఏప్రిల్‌లో 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరుకోవడంతో వరుసగా ఏడవ నెలలో అధికంగా నమోదైంది. మరోవైపు ఏప్రిల్‌లో దేశీయ టోకు ద్రవ్యోల్బణం కూడా 13 నెలలుగా రెండంకెల స్థాయిలోనే 15.08 శాతంగా నమోదైంది. ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం ఇప్పటికే పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశీయ రుతుపవనాలు సానుకూలంగా ఉండనున్న పరిస్థితులతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు దిగొస్తుండటం వంటి అంశాలు ఎంపీసీ సమావేశంలో కీలకం అవనున్నాయి. రేట్ల పెంపు విషయలో అంచనాలు కొలిక్కి రావడంలేదని, రెపో రేట్లలో కొంత పెరుగుదల ఉంటుందని, కానీ 5.15 శాతం వరకు పెంచే అవకాశాల్లేవని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దాస్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed