BMW: జనవరి నుంచి 3 శాతం ధరల పెంపును ప్రకటించిన బీఎండబ్ల్యూ ఇండియా

by S Gopi |
BMW: జనవరి నుంచి 3 శాతం ధరల పెంపును ప్రకటించిన బీఎండబ్ల్యూ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్లు తమ వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మెర్సిడెజ్ బెంజ్ కొత్త ఏడాదిలో ధరలను పెంచుతామని ప్రకటించగా, అదే బాటలో మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా కూడా జనవరి నుంచి తన అన్ని మోడళ్లపై 3 శాతం మేర ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. జనవరి 1వ తేదీ నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇన్‌పుట్ వ్యయం, ద్రవ్యోల్బణ ఒత్తిడి, కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్పత్తులను అందించడంలో రాజీ పదబోమని కంపెనీ స్పష్టం చేసింది. బీఎండబ్ల్యూ ప్రస్తుతం స్థానికంగా 2 సిరీస్ గ్రాన్ కూపేతో పాటు 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ వీల్‌బేస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ కార్లను తయారు చేస్తోంది. ఇవి కాకుండా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం2 కూపే మోడళ్లను పూర్తిగా తయారైన తర్వాత దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేసుకుంటోంది. కాగా, ఇటీవలే మెర్సిడెస్ బెంజ్ కూడా తన అన్ని కార్ల ధరలను 3 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story