Maruti Suzuki: ఆడి, హ్యుండాయ్ బాటలో కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకీ

by S Gopi |
Maruti Suzuki: ఆడి, హ్యుండాయ్ బాటలో కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన మార్కెట్లో కార్ల ధరలు ఖరీదవుతున్నాయి. ఇప్పటికే ఆడి ఇండియా, హ్యూండాయ్ కంపెనీలు పెంపు నిర్ణయాన్ని ప్రకటించగా, వాటి బాటలోనే ప్యాసింజర్ దిగ్గజం మారుతీ సుజుకి కూడా 2025, జనవరి నుంచి అన్ని కార్లపై 4 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్‌ని బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది. పెరుగుతున్న ఖర్చులను సమం చేయడానికి, వాహనాల తయారీలో పెరిగిన వ్యయాన్ని భరించేందుకు కొంత మొత్తం వినియోగదారులపై భారం వేయక తప్పటంలేదని కంపెనీ వివరించింది. ఖర్చులను నియంత్రిస్తూ కస్టమర్లపై భారం తగ్గించేందుకు అవసరమైన ప్రయత్నాలను కొనసాగిస్తామని మారుతీ సుజుకి పేర్కొంది. ఇటీవలే లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్ ఆడి ఇండియా, హ్యూండాయ్ మోటార్ ఇండియా కంపెనీలు కొత్త ఏడాది నుంచి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆడి ఇండియా 3 శాతం మేర పెంపును అమలు చేయగా, హ్యూండాయ్ మోటార్ ఇండియా అన్ని మోడళ్లపై రూ. 25,000 వరకు పెంచింది.

Next Story

Most Viewed