Network coverage: పది మందిలో నలుగురికి నెట్‌వర్క్ కవరేజ్ సమస్య

by Harish |   ( Updated:2024-07-30 07:35:54.0  )
Network coverage: పది మందిలో నలుగురికి నెట్‌వర్క్ కవరేజ్ సమస్య
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల కారణంగా డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని లోకల్‌సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పది మందిలో నలుగురు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. 3G, 4G,5G నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్యలు గమనించినట్లు నివేదిక పేర్కొంది. దాదాపు 58 శాతం మంది యూజర్లు నెలకు అనేక సార్లు అంతరాయాలను ఎదుర్కొన్నారు. టెలికాం సేవల నాణ్యత, నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తున్న సమయంలో ఈ డేటా వెలువడటం గమనార్హం.

లోకల్‌సర్కిల్స్ ప్రకారం, మొబైల్ డేటా కనెక్టివిటీలో స్వల్ప మెరుగుదల ఉంది, గత రెండేళ్లలో మొబైల్ ఆర్థిక లావాదేవీల సమయంలో అంతరాయాలను ఎదుర్కొన్న వారి శాతం 68 నుండి 58 శాతానికి తగ్గింది. 2022లో మునుపటి సర్వేలో, దాదాపు 92 శాతం మంది మొబైల్ డేటాను ఉపయోగించి బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నప్పుడు తరచుగా అంతరాయం లేదా నెట్ వేగం తక్కువగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యల కారణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గత రెండేళ్లుగా కాల్‌ల కోసం ఇంటర్నెట్ లేదా వై-ఫైపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో నెట్‌వర్క్ సమస్యల కారణంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి ట్రాయ్ రంగంలోకి దిగి ఆపరేటర్లతో కలిసి పనిచేసి మెరుగైన కనెక్టివిటీని అందుబాటులో ఉంచేలా చూడాలని లోకల్ సర్కిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని 329 జిల్లాల్లో 39,000 వినియోగదారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. టైర్-1 నగరాల నుంచి 44 శాతం మంది, టైర్-2 నుండి 34 శాతం మంది, టైర్ 3,4 నుంచి 22 శాతం మంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed