పేటీఎంను వదిలి ఇతర యాప్‌లకు మారుతున్న కిరాణా స్టోర్‌లు

by S Gopi |
పేటీఎంను వదిలి ఇతర యాప్‌లకు మారుతున్న కిరాణా స్టోర్‌లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆర్థిక రంగంలో పేటీఎం సంక్షోభం ఇంకా ప్రభావం చూపుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వారం క్రితం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం ఇక పనిచేయదనే ఆందోళనలతో దేశంలోని 42 శాతం కిరాణా స్టోర్ల యజమానులు ఇతర మొబైల్ చెల్లింపుల యాప్‌లకు మారినట్టు ఓ సర్వే తెలిపింది. గురువారం కిరాణా క్లబ్ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ఆర్‌బీఐ ప్రకటన తర్వాత 68 శాతం మందికి పేటీఎంపై నమ్మకం సన్నగిల్లింది. మరో రకంగా చూస్తే దేశీయంగా డిజిటల్ చెల్లింపులకు సంబంధించి రిటైలర్లకు పేటీఎంకు ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుందని కిరాణా క్లబ్ అభిప్రాయపడింది. 42 శాతం మంది పేటీఎం పేమెంట్స్ బ్యాంకును వదిలి ఇతర యూపీఐ యాప్‌లను వాడటం ప్రారంభించారు. మరో 20 శాతం మంది ఇతర చెల్లింపుల యాప్‌లకు మారడానికి సిద్ధంగా ఉన్నారు. 'ఆర్‌బీఐ పేటీఎంపై విధించిన ఆంక్షలు డిజిటల్ చెల్లింపులపై ఆధారపడిన కిరాణా స్టోర్‌లకు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే, ప్రత్యామ్నాయాంగా ఇతర చెల్లింపుల యాప్‌లు, పద్దతులు ఉండటం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇతర చెల్లింపుల యాప్‌లను ఉపయోగించడం మొదలుపెట్టిన, అందుకు సిద్ధంగా ఉన్న రిటైలర్లలో 50 శాతం మంది ఫోన్‌పేను ఎంచుకుంటున్నట్టు తేలింది. దీని తర్వాత గూగుల్‌పేను 30 శాతం, భారత్‌పేను 10 శాతం మంది ఎంచుకుంటున్నారు.

Advertisement

Next Story