‘గ్రామీణ ప్రాంతాల్లో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కే ఎక్కువ డిమాండ్’

by Harish |   ( Updated:2024-06-08 08:38:09.0  )
‘గ్రామీణ ప్రాంతాల్లో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కే ఎక్కువ డిమాండ్’
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2022-23లో గ్రామీణ ప్రాంతాల కుటుంబాలు ఆహారం కోసం చేసిన ఖర్చులో ఎక్కువ భాగం ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల కోసం అత్యధికంగా వెచ్చించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం కోసం చేసే ఖర్చు 46 శాతంగా ఉంది. అయితే దానిలో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వినియోగం 9.6 శాతంగా ఉంది. అలాగే, పాలు, పాల ఉత్పత్తులపై ఖర్చు 8.3 శాతంగా ఉంది. కూరగాయల విషయానికి వస్తే, వీటిపై ఖర్చు 5.38 శాతంగా ఉంది. మొత్తం ఆహార ఖర్చులో తృణధాన్యాల కోసం వెచ్చించిన ఖర్చు 4.91 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా పేర్కొంది.

ఇదే 2022-23లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగదారుల వ్యయం ప్రకారం ఆహారం కోసం చేస్తున్న ఖర్చు 39 శాతంగా నమోదైంది. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం కోసం అత్యధికంగా 10.64 శాతం ఖర్చు చేశారు. అలాగే, పాలు, పాల ఉత్పత్తుల ఖర్చు 7.22 శాతం, పండ్లు, కూరగాయలు ఒక్కొక్క దానిపై 3.8 శాతంగా ఉంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం వినియోగ వ్యయంలో ఆహారం కోసం చేస్తున్న ఖర్చుల్లో చాలా తేడాలు ఉన్నాయి. మొత్తం వ్యయంలో ఆహార వాటా కేరళలో 39 శాతం, బీహార్, అస్సాంలో 54 శాతం వరకు ఉంటుంది. పట్టణ రంగానికి సంబంధించి ఆహార వాటా తెలంగాణలో 35 శాతం, అస్సాం, బీహార్‌లలో 47 శాతానికి అటు ఇటుగా ఉంది.

గ్రామీణ రంగంలో, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మినహా దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాల్లో మొత్తం ఆహార వ్యయంలో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారానికి ఎక్కువగా వెచ్చించారు. కేరళలో మాత్రం గుడ్డు, చేపలు, మాంసం కోసం ఎక్కువగా వెచ్చించారు. పట్టణ రంగంలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మినహా దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాల్లో మొత్తం ఆహార వ్యయంలో పానీయాలు, ప్రాసెస్ చేయబడిన ఆహార వాటా గరిష్టంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed