RBI: మైక్రోసాఫ్ట్ ఎర్రర్ వల్ల దేశీయంగా 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ప్రభావం: ఆర్‌బీఐ

by S Gopi |
RBI: మైక్రోసాఫ్ట్ ఎర్రర్ వల్ల దేశీయంగా 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ప్రభావం: ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీని ప్రభావం అనేక దేశాల్లో ప్రధాన బ్యాంకులు, విమానాశ్రయాలు, ఇతర ప్రభుత్వ సేవలపై కనబడింది. ఇదే సమయంలో దేశీయంగా కూడా 10 బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) చిన్నపాటి అంతరాయాన్ని ఎదుర్కొన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. అవన్నీ పరిష్కరించామని, ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పనితీరు సాధారణంగానే ఉందని తెలిపింది. కొన్నిటిలో ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ డొమైన్ పరిధిలోని భారతీయ ఆర్థిక రంగం భద్రంగానే ఉందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 'తమ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలపై మైక్రోసాఫ్ట్ ఎర్రర్ ప్రభావం గురించి అంచనా వేశాం. చాలా బ్యాంకుల్లో కీలకమైన వ్యవస్థలు క్లౌడ్ పరిధిలో లేవు. కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ సాధనాన్ని ఉపయోగిస్తున్నాయి. అందుకే కొంతమేర సమస్య ఏర్పడిందని ఆర్‌బీఐ తన అధికారిక ప్రకటనలో వివరించింది. అంతేకాకుండా ఆర్‌బీఐ తన సంస్థలకు అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెబుతూ, తగిన సలహాలను జారీ చేసింది.

Advertisement

Next Story