ఆ విషయంలో మోడీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటే.. షబ్బీర్ అలీ

by Disha News Web Desk |
ఆ విషయంలో మోడీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటే.. షబ్బీర్ అలీ
X

దిశ, కామారెడ్డి: భారత రాజ్యాంగం విషయంలో మోడీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని, ప్రజలను మభ్యపెట్టడానికి ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన త్యాగాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో శాంతి, మానవత్వానికి మరో పేరుగా మహాత్మా గాంధీని అందరూ గుర్తిస్తారని తెలిపారు. అలాంటి మహాత్మాగాంధీని చంపిన గాడ్సేకి బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు కడుతూ ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతుందన్నారు. గాంధీ కంటే గాడ్సే గొప్పవాడని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజలకు చెపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారని షబ్బీర్ అలీ తెలిపారు. పైకి వేరుగా ఉన్నా రాజ్యాంగం విషయంలో మోడీ, కేసీఆర్ ఒక్కటేనన్నారు. రాజ్యాంగం మార్చాలని మీడియా ముఖంగా చెప్పిన కేసీఆర్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మాచారెడ్డి మండల కేంద్రంలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, బాలవికాస్ సంయుక్తంగా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందించడానికి నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.

Advertisement

Next Story