కల్వకుంట్ల గడీలను బద్దలు కొడతాం: సామ రంగారెడ్డి

by Disha News Web Desk |
కల్వకుంట్ల గడీలను బద్దలు కొడతాం: సామ రంగారెడ్డి
X

దిశ, ఎల్బీనగర్: సీఎం కేసీఆర్ ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడమేమో గానీ.. తెలంగాణలో కల్వకుంట్లగడీలు బద్దలు కొట్టడం ఖాయమని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానంటూ, ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుండి వెళ్ళగొడతానంటూ సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. శనివారం సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో చింతలకుంట చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి ఎల్బీనగర్‌లోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు కొప్పు బాషా మాట్లాడుతూ.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఏడేండ్లు గడుస్తున్నా చేయలేదన్నారు. దళితులకు 3ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడుస్తలేదని.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అనంతరం సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌కు ప్రధాని నరేంద్రమోడీకి ఎదురుపడే ధైర్యం లేదని అన్నారు. ప్రధానిని దేశం నుంచి వెళ్లగొడతాననడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్‌.. ఢిల్లీ కోటలు బద్దలు కొడతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడేమో గానీ.. తెలంగాణ ప్రజలు మాత్రం కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పిట్టా ఉపేందర్ రెడ్డి, వై. శ్రీధర్, గోవెర్దన్ గౌడ్, కార్పొరేటర్లు వంగ మధుసూదన్ రెడ్డి, కొప్పుల నరసింహ రెడ్డి, రాధా ధీరజ్ రెడ్డి, కళ్లెం నవ జీవన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, లచ్చి రెడ్డి , ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, చింతల సురేందర్ యాదవ్, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బాణాల ప్రవీణ్, కొత్త రవీందర్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కృష్ణవేణి, కొమరయ్య తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed