జూన్ 18 తర్వాత టీకాలకు బ్రేక్..?

by Anukaran |
జూన్ 18 తర్వాత టీకాలకు బ్రేక్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం దగ్గర అందుబాటులో ఉన్న ఏడున్నర లక్షల టీకాల తర్వాత వ్యాక్సినేషన్ ఎట్లా అనేది ఇప్పుడు వైద్యారోగ్య శాఖ వర్గాలను ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం స్వయం సహాయక మహిళా బృందాలకు, కొద్దిమంది హై రిస్కులో ఉన్న వృత్తికారులకు ఇస్తున్న టీకాల ప్రక్రియ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. అప్పటివరకూ కొత్త రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఆ ప్రకారం వ్యాక్సినేషన్‌ కొనసాగనుంది. ఈ డోసులు అయిపోతే కొత్తగా కేంద్రం నుంచి వచ్చేవాటిపైనే రాష్ట్రం నమ్మకం పెట్టుకుంది. అక్కడి నుంచి ఎన్ని డోసులు వస్తాయో ఇంకా క్లారిటీ లేనందువల్ల వచ్చిన తర్వాతే తదుపరి ప్లానింగ్ చేసుకోవాలని వైద్యాధికారులు భావిస్తున్నారు.

ప్రధాని మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా జూన్ 21 నుంచి వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉంది. కానీ రాష్ట్రం దగ్గర టీకాలు లేకపోవడంతో ఆ ప్రక్రియ లాంఛనంగా మాత్రమే ప్రారంభించాలన్న చర్చలు వైద్యారోగ్య శాఖలో జరుగుతున్నాయి. ఒకవేళ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో కోటా వచ్చినట్లయితే పూర్తిస్థాయిలోనే ఈ ప్రక్రియ జరుగుతుందని, రాని పక్షంలో నిర్వహించడం కష్టమేనని అధికారుల అభిప్రాయం.

కేంద్రం నుంచి వచ్చే స్టాకుకు అనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న డోసులకు అనుగుణంగా ఈ నెల 17 వరకూ కొత్త రిజిస్ట్రేషన్లు కంటిన్యూ అవుతాయని, అందులోని స్లాట్లకు అనుగుణంగా ఈ నెల 20వ తేదీ వరకు టీకాల పంపిణీ ఉంటుందని వివరించారు. కేంద్రం నుంచి జూన్ కోటా కింద సుమారు 12 లక్షల డోసులు రావాల్సి ఉందని, ఈ నెల చివరికల్లా లేదా జూలై 2వ తేదీ వరకు వస్తాయని ఆశిస్తున్నామని, అవి వచ్చిన తర్వాతనే కొత్త రిజిస్ట్రేషన్లపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

సెకండ్ డోస్ యథాతథం

టీకాల కొరత ఉన్నందున సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వారికి ప్రాధాన్యత ఇస్తామని, వారికి వాయిదా వేయబోమని, యథావిధిగా ఆ ప్రక్రియ ఉంటుందని ఆ అధికారి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 81.66 లక్షల మందికి టీకాల పంపిణీ పూర్తయింది. ఇందులో 66.17 లక్షల డోసులు ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలో ఇవ్వగా మిగిలిన 15.48 లక్షలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇచ్చారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 74.15 లక్షల డోసులు వస్తే మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేశాయి. ప్రజారోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొదటి డోస్ తీసుకున్నవారు 66.48 లక్షల మంది. సెకండ్ డోస్ పూర్తిచేసుకున్నవారు 15.17 లక్షల మంది.

ఫస్ట్ డోసు తీసుకున్నవారిలో ఈ నెల చివరికల్లా ఎంత మందికి సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలేసుకున్న ప్రభుత్వం కేంద్రం నుంచి కోటా వచ్చేంత వరకు రాష్ట్రం దగ్గర అందుబాటులో ఉన్నవాటినే వినియోగించాలనుకుంటున్నది. ఇంతకాలం వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఇటీవల కేంద్రమే సమకూర్చనున్నట్లు చెప్పడంతో ఇక ఎదురుచూపులు మినహా మరో మార్గం లేకుండాపోయింది.

Advertisement

Next Story

Most Viewed