‘బుక్ మై షో’లో 20 శాతం ఉద్యోగాల కోత!

by Harish |   ( Updated:2020-05-29 04:30:56.0  )
‘బుక్ మై షో’లో 20 శాతం ఉద్యోగాల కోత!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్న జాబితాలో ప్రముఖ బుకింగ్ సైట్ ‘బుక్ మై షో’ కూడా చేరింది. ఇటీవల తమ సంస్థలో పనిచేస్తున్న మొత్తం 1,450 మంది ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. దీని ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో 270 మంది ఉపాధి కోల్పోయే అవకాశముంది. కరోనా సంక్షోభం వల్ల ఆర్థికంగా జరిగిన నష్టాలను అధిగమించేందుకు, ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని బుక్ మై షో వెల్లడించింది. మరి కొద్ది నెలల్లో ఈ తొలగింపు ప్రక్రియ ఉంటుందని, ఇప్పటికే జీతంలేని సెలవుల్లో ఉన్నవారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రమాణాల ప్రాతిపదికన అన్ని రకాల వైద్య, బీమా, గ్రాట్యూటీ లాంటి ఇతర అలవెన్సులను ఇస్తామని బుక్ మై షో సీఈవో ఆశిష్ హేంరజనీ తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థలోని కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా 10 నుంచి 50 శాతం వరకు జీతాల్లో కోత విధించుకున్నారని, బోనస్‌లను కూడా వదులుకున్నట్టు ఆయన ప్రస్తావించారు. ఇవికాకుండా కంపెనీకి తోడయ్యే పలు ఖర్చులను తగ్గించుకుంటున్నట్టు వివరించారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తి కారణంగా థియేటర్లు, స్టేడియంలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు మూసేయడంతో వ్యాపారాలన్నీ కుప్పకూలాయి. నష్టాలను అధిగమించడానికి ఉద్యోగాల కోత, వేతనాల కోతను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే, స్విగ్గీ, ఓలా, ఉబెర్ లాంటి కంపెనీలు వందల్లో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed