బీజేపీ ఎంపీ ఇంటి సమీపంలోనే 15 చోట్ల బాంబు పేలుళ్లు.. హీటెక్కిన బెంగాల్ ఎన్నికల సమరం

by Shamantha N |   ( Updated:2021-03-17 22:33:10.0  )
Barrackpur BJP MP Arjun Singh
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయాలు రోజురోజుకూ హీట్‌ను పెంచుతున్నాయి. బరాక్‌పూర్ ఎంపీ, బీజేపీ నాయకుడు అర్జున్ సింగ్‌ ఇంటికి సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని జగత్దల్ ప్రాంతంలోని అర్జున్ సింగ్ ఇంటికి సమీపంలోనే బాంబులు పేలాయి. ఆయన ఇంటి చుట్టుపక్కల మరో 15 చోట్ల కూడా గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక చిన్న పాప కూడా ఉంది.

బాంబు పేలుళ్ల శబ్దం విన్న తర్వాత కొద్దిసేపటికే తన ఇంటినుంచి బయటకు వచ్చిన అర్జున్ సింగ్.. ఇది కచ్చితంగా టీఎంసీ కుట్రేనని ఆరోపించారు. ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడానికే టీఎంసీకి చెందిన కార్యకర్తలు తమ ఇంటికి సమీపంలో బాంబులు విసిరారని అన్నారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఒక బాంబు పేలడంతో ఆయన వారిపై ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

ఇదిలాఉండగా.. అర్జున్ సింగ్ వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. బీజేపీలో టికెట్ల లొల్లి నడుస్తున్నదని, ఇది అసంతృప్తుల పనే తప్ప తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed