ఉత్తరాఖండ్ నూతన సీఎంగా తీరథ్ సింగ్ రావత్

by Anukaran |   ( Updated:2021-03-10 01:07:43.0  )
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా తీరథ్ సింగ్ రావత్
X

సిమ్లా : ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు తెరపడింది. ఎవ్వరూ ఊహించిన రీతిలో బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను ఎంచుకుంది. బీజేపీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యదర్శి తీరథ్ సింగ్ రావత్‌ను రాష్ట్ర సీఎంగా నియమించింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో కొన్నాళ్లు నాయకత్వ మార్పుపై ఊహాగానాలు సాగాయి. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన రాజీనామాను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు. అనంతరం తర్వాతి సీఎం ఎవరన్న చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సహా ధన్ సింగ్ రావత్ సహా పలువురు సీఎం బరిలో ఉన్నట్టు చర్చ సాగింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ తీరథ్ సింగ్ రావత్‌ను సీఎం చేసింది. ఈయన గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2013 నుంచి 2015 మధ్యలో బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed