కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ATM : కేంద్రమంత్రి

by Sridhar Babu |   ( Updated:2021-09-05 02:40:52.0  )
కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ATM : కేంద్రమంత్రి
X

దిశ, జమ్మికుంట : కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలాగా మారిందని కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు రూ.1,30,000 కోట్లకు ఎలా పెరిగిందని, ఇందులో కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు అందుతున్నాయని ఆరోపించారు. నరేగా పథకం కింద రూ.15,738 కోట్లను కేంద్రం అందిస్తే, పేద వారికి ఇవ్వకుండా అందులో రూ.7500 కోట్లను కేసీఆర్ దారి మళ్ళించారని.. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజలందరూ కేసీఆర్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ, ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, 1400 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించింది కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ సెప్టెంబర్ 17న విముక్తి పొందిందని, దానిని లిబరేషన్ డేగా ప్రకటించిన కేసీఆర్ ఎంఐఎం అధినేత ఓవైసీకు భయపడి మాట తప్పారని మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు నిధులను సమానంగా అందజేస్తున్నారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రోడ్లు, డిజిటల్ కనెక్షన్ ద్వారా వేల కోట్లు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం వాటిని సరిగ్గా వినియోగించడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అసమర్థత వల్ల 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిందని, ఆ తర్వాత ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి నాలుగు ఎంపీలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానం కల్పించారన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక కేసీఆర్‌కు ఒక హెచ్చరిక లాంటిదని, ఉపఎన్నికల సందర్భంగా ఏడేళ్లపాటు గుర్తుకు రాని దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా..? అంటూ ప్రశ్నించారు.

దళిత బంధు పథకాన్ని బీజేపీ స్వాగతిస్తున్నదని అన్నారు. కానీ, దళితులతో పాటు ఇతర కులాల వారికి రూ.10 లక్షల చొప్పున సాయం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రంలో 40 మంది ఓబీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ముదిరాజ్, విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ లాంటి వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని వివరించారు. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’అనేది మోడీ విధానమైతే కేసీఆర్ ది మేరా పరివార్ కా వికాస్ విధానంలా ఉందన్నారు. తెలుగు ఆత్మగౌరవం కోసం అప్పట్లో నాయకులు కొట్లాడితే, ఇప్పుడేమో తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాట నడుస్తుందన్నారు. హుజురాబాద్‌లో జరిగే ఉపఎన్నిక చరిత్ర కేసీఆర్‌కు హెచ్చరిక లాంటిదన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ, ఎన్నికల ఇన్చార్జి జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కూన శ్రీశైలం గౌడ్, ధర్మారావు, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed