టీఆర్ఎస్‌కు ఓటమి భయం..

by Shyam |
టీఆర్ఎస్‌కు ఓటమి భయం..
X

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ఇప్పటికే వేడి రాజుకుంది. పోలింగ్ తేదీ సమీపించిన కొద్దీ అది మరింతగా ఎగిసి పడుతోంది. ఎన్నడూ లేనంతగా ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుపును అందుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. యువత, మహిళలు సింహభాగంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అభివృద్ధికి ఆమడదూ రంగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆరేళ్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి పట్టం గడతారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆయన ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో:

గతానికీ ఇప్పటికీ మారిన పరిస్థితేంటి?

గడచిన 20 ఏళ్ళుగా ఒక్కసారి మినహా ప్రతీసారి దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారు. ఈసారి మాత్రం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. దుబ్బాకకు ఆనుకుని ఉన్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల అభివృద్ధితో పోల్చి చూసుకుంటున్నారు. అన్యాయమే జరిగుతోందనే నిర్ధారణకు వచ్చారు. ఇంతకాలం చేయలేని అభివృద్ధిని ఇప్పుడు మూడేళ్లలో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ నమ్మిస్తోంది. ప్రజలు నమ్మడంలేదు. అందుకే బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. అదే గతానికీ ఇప్పటికీ మారిన పరిస్థితి.

సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రభావం ఎంత?

సంక్షేమం, అభివృద్ధి పథకాలను అధికార పార్టీ పదేపదే గొప్పగా చెప్పుకుంటోంది. అదే అభివృద్ధి గురించి ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. పక్క నియోజకవర్గాలకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన డబ్బు, ఇచ్చిన ప్రాధాన్యం లాంటి అంశాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ మూడు చోట్ల వచ్చిన అభివృద్ధి పనులు దుబ్బాకకు ఎందుకు రాలేదని చర్చించుకుంటున్నా రు. ఆరేళ్లలో చేయలేని అభివృద్ధి మూడేళ్లలో చేస్తారన్న నమ్మకం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు చూశారు. ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి బీజేపీని గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారు.

సీఎం సొంత జిల్లాకే ఎక్కువ నిధులు పోతున్నాయనే అభిప్రాయం ఉంది గదా?

గడచిన ఆరేళ్లలో గజ్వేల్ నియోజకవర్గానికి రూ. 434 కోట్లు వచ్చాయి. సిద్దిపేటకు రూ.180 కోట్లు వచ్చాయి. దుబ్బాకకు కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌కు, జిల్లా మంత్రి హరీశ్‌రావుకు ఎంత శ్రద్ధ, ప్రేమ ఉందో తేలిపోతోంది. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ వచ్చింది. 300 పడకల ఆసుపత్రి వచ్చింది. గజ్వేల్‌కు కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చింది. దుబ్బాకలో ఇప్పటికీ 100 పడకల ఆసుపత్రి పునాదుల దగ్గరే ఉంది. ఆర్టీసీ బస్సు స్టేషన్ అందం చూస్తే అభివృద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది అభివృద్ధిపైనే గదా?

గడచిన ఆరేళ్లలో ఈ నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి ఏంటో, ప్రభుత్వం ఖర్చుపెట్టినదెంతో లెక్కలు బయట పెట్టాలని ఆర్థిక మంత్రి కూడా అయిన హరీశ్‌రావును నేను చాలా సార్లు డిమాండ్ చేశాను. శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పాలని కోరాను. ఇప్పటికీ ముందుకు రాలేదు. ఆ పని చేస్తే ప్రజలు ఛీ కొడతారని హరీశ్‌రావుకు తెలుసు. అందుకే తప్పించుకుంటు న్నారు. అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనుకుని హరీశ్ రావు డిసైడ్ అయిపోయారు.

బీజేపీకి ప్రజల ఆదరణ ఎక్కడుంది?

గతంలో రెండుసార్లు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాను. ఒకసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశాను. ఓట్ల సంఖ్య పెరిగింది. ఈసారి చాలా మార్పు జరిగింది. మేం మొదటి స్థానంలో ఉన్నాం. గెలుపు ఖాయం. ఈ సంగతిని గ్రహించింది కాబట్టే టీఆర్ఎస్ భయపడుతోంది. నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా, బంధువులపైనా వేధింపులు మొదలు పెట్టింది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోంది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ నేతలను దుబ్బాకకు తరలించింది. ఇతర పార్టీల నుంచి లాగేసుకుంటోంది. ప్రలోభాలు పెడుతోంది. నేను గెలుస్తున్నా నన్న భయంతోనే ఆ కుట్రలకు తెరలేపింది. నిజంగా నాకు డిపాజిట్ కూడా రాదనుకుంటే హరీశ్‌రావు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? సోదాల పేరుతో ఎందుకు నన్ను వేధిస్తున్నారు?

డబ్బు దొరికింది నిజం కాదా?

దొరికిన డబ్బుతో నాకేం సంబంధం? శామీర్‌పేటలో రూ.40 లక్షలు దొరికినట్లు నాపై బురదజల్లారు. ఆ డబ్బు నాదే అయితే ఇప్పటిదాకా నోటీసు కూడా ఇవ్వలేదు. పట్టుబడిన ఆ నలుగురి వివరాలను పోలీసులు ఎందుకు బయట పెట్టలేదు? అందులో ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు కాదా? ఆ డబ్బుకు నాకు సంబంధమే లేదు. నిజంగా సంబంధమే ఉంటే పోలీసులు ఇప్పటిదాకా ఊరుకునేవారా?

సిద్దిపేట దాడుల్లో దొరికిన డబ్బు మీది కాదా?

సిద్దిపేటలో రూ.18.67 లక్షలు దొరికినట్లు పోలీసులు చెప్పారు. ఆ డబ్బు అంజన్ రావుకు సంబంధించినది. ఆయనతో నాకేం సంబంధం? ఇంటిపేరును చెప్పి నాకు బంధుత్వాన్ని అంటగడు తున్నారు. అంజన్ రావుపై పోలీసులు వత్తిడి తెచ్చి బీజేపీ నేతలు ఓటర్లకు పంచడానికి ఉద్దేశించినదే అంటూ చెప్పించారు. అంజన్ రావు చెప్తే నేనేం చేయగలను? ఆయనకు నాకు సంబం ధమే లేదు. ఆ డబ్బుతో అసలే సంబంధం లేదు. నిజానికి అంజన్ రావు ఇంట్లో గోడలకు వేలాడుతున్న ఫోటోల్లో హరీశ్‌రావు ఎందుకున్నారు. ఆ సంబంధం ఏంటో ముందు బయటకు రావాలి.

పోలీసులు వీడియోను కూడా రిలీజ్ చేశారు గదా!

నిజానికి ఎన్నికల నిబంధన ప్రకారం సోదాలు చేసే ముందు సెర్చి వారెంటు జారీ చేయాలి. మధ్యాహ్నం రెండు గంటల్లోపే సోదాలన్నీ పూర్తయిన తర్వాత ఐదున్నర గంటలకు వారెంట్ నోటీసు ఇచ్చారు. ఈ పాయింట్‌ను నేను లేవనెత్తినందుకే పోలీసులు ఆ పనిచేశారు. సోదాల సమయంలో పోలీసులు మఫ్టీలో ఎందుకెళ్లారు? ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు మహిళా పోలీసుల్ని ఎందుకు రప్పించలేదు? అంజన్ రావు వాంగ్మూలం ఇస్తే అది చెల్లుబాటవుతుందా? పోలీసులు బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించుకుంటే దానికి నేనెలా బాధ్యుడినవుతాను. పోలీసులు వారికి పనికొచ్చే వీడియోలను రిలీజ్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకుంటున్నారు.

ఈ ఎపిసోడ్‌తో బీజేపీ బద్నాం అయిందనుకుంటున్నారా?

మార్పును కోరుకుంటున్న ప్రజలంతా నిఖార్సుగా బీజేపీవైపే ఉన్నారు. ఇలాంటి కుట్రలకు లొంగరు. ఈ సోదాలు, దాడులు ఉద్దేశపూర్వకంగా నన్ను, నా పార్టీని వేధించడానికేనని ప్రజలకు బాగానే అర్థమైంది. మా కేడర్ ఆత్మస్థయిర్యం ఏ మాత్రం దెబ్బతినలేదు. నేనుక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగాను. ఇప్పుడు ప్రచారంలో ఉన్న నా పార్టీ కార్యకర్తలు కూడా స్పష్టమైన అవగాహన, సిద్ధాంతం ఉన్నవారే. ఇలాంటి వేధింపులకు భయపడేవారు కాదు.

ప్రభుత్వ యంత్రాంగంపైనే మీరు ఆరోపణలు చేస్తున్నారు!

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. వ్యవస్థలను టీఆర్ఎస్ భ్రష్టు పట్టిస్తోంది. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. ఎన్నికల సంఘం ఆ ప్రకారం నిర్వహించాలనే కోరుతున్నాను. అదే విషయాన్ని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాను. అధికార పార్టీ వ్యవహారం గురించి ఫిర్యాదు చేశాను. నిజంగా నాకు డిపాజిట్ కూడా దక్కదు అని టీఆర్ఎస్ భావిస్తే సిద్దిపేట నుంచి సర్పంచ్ మొదలు జిల్లా పరిషత్ ఛైర్మన్ వరకు వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులను దుబ్బాకకు ఎందుకు తరలిస్తున్నారు? ఇంతగా నన్ను వేధించాల్సిన అవసరం ఏమొచ్చింది. అక్కడే ఆ పార్టీ, హరీశ్‌రావు పడుతున్న హైరానా, ఆందోళన, భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

గెలుపుపై మీ ధీమా ఎంత?

గెలవడం ఖాయం. గతానికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ప్రభుత్వం పట్ల యువత చాలా అసంతృప్తితో ఉంది. ఏళ్లు గడిచినా నియోజకవర్గం అభివృద్ధి కాలేదని, అన్యాయం జరిగిందని ప్రజల్లో బలంగా ముద్ర పడింది. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. ప్రజల అవసరాలను అసెంబ్లీలో గొంతెత్తి ప్రశ్నించే ఎమ్మెల్యేను ఎన్నుకోవాలిన బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అటు ఢిల్లీలో, ఇటు గల్లీలో లేదనే అంచనాకు వచ్చారు. అందుకే ఈసారి బీజేపీకి ఓటు ఖాయం. నేను గెలవడం ఖాయం. మెజారిటీ గురించి చెప్పడానికి నేను జ్యోతిష్యుడ్ని కాను.

Advertisement

Next Story