కాలేజీ పూర్తి చేయలేదు, కానీ బిలియనీర్లు!

by Shyam |
కాలేజీ పూర్తి చేయలేదు, కానీ బిలియనీర్లు!
X

‘‘పెద్ద చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం పొంది, మరింత డబ్బు సంపాదించాలి’’ అని చిన్నప్పుడు పెద్దవాళ్లు దీవించేవారు. ఆ దీవెనలో కొద్దిగా మార్పుచేసి ‘‘తెలివిగా అన్ని నేర్చుకుని, ఓ కంపెనీ పెట్టి, బిలియనీర్ అవ్వాలి’’అని అనాలి. ఇక్కడ ఈ రెండు దీవెనలు చూడటానికి ఒకేలా కనిపిస్తున్నా..ప్రాక్టికల్‌గా చాలా తేడా ఉంటుంది. మొదటి దాంట్లో ఉన్న చదువు ప్రస్తావన, రెండో దీవెనలో లేదు. అలాగే మొదటి దాంట్లో ఉద్యోగం చేయండి అన్నారు, కానీ, రెండో దాంట్లో కంపెనీ పెట్టు అంటున్నారు. ఈ రెండు తేడాలు చాలు జీవితం ఒక గొప్ప మలుపు తిరగడానికి. ఇది ఊరికే చెబుతున్న మాటలు కాదు, దీన్ని రుజువు చేసిన బిలియనీర్లు ఎంతో మంది ఉన్నారు. వీళ్లెవరూ కాలేజీ విద్య పూర్తి చేయలేదు. పైగా కాలేజీ విద్య విజయవంతంగా మంచి మార్కులతో పూర్తి చేసిన ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ బిలియనీర్లలో చాలా మంది మనకు తెలిసిన వారే!

1. బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రెండేండ్లు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి, మైక్రోసాఫ్ట్ స్థాపించడానికి మధ్యలోనే చదువును వదిలేశారు. ప్రస్తుతం 64 ఏండ్ల వయస్సులో 114.3 బిలియన్ డాలర్ల ఆస్తిని వెనకేసుకున్నారు. ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే 2007లో ఆయన చదువు మానేసిన హార్వర్డ్ యూనివర్సిటీ వారే బిల్ గేట్స్‌కు గౌరవ డిగ్రీ బహూకరించారు. డిగ్రీ సంపాదించడం కాదు.. గౌరవ డిగ్రీ సంపాదించడం నిజమైన విజయం అని బిల్ గేట్స్ నిరూపించారు.

2. మార్క్ జుకర్‌బర్గ్

చూడ్డానికి ఎప్పుడూ ఒకే రకం దుస్తులు వేసుకుని సాధారణ కాలేజీ ప్రొఫెసర్ మాదిరిగా కనిపించే 36 ఏండ్ల మార్క్ జుకర్‌బర్గ్ గురించి వేరే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అనేది ఒకటి పుట్టిందంటే అది మార్క్ కనిపెట్టిన ఫేస్‌బుక్ వల్లనే సాధ్యమైంది. ఆ ఫేస్‌బుక్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ చదువును మధ్యలోనే వదిలేశారు. అంటే ఆయన ఆలోచన మీద నమ్మకాన్ని మెచ్చుకుని తీరాలి. ఇప్పుడు 98.6 బిలియన్ డాలర్ల ఆస్తితో ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం వంటి యాప్‌లకు యజమానిగా ఇటు సోషల్ మీడియాను, అటు మార్కెట్‌ను, ఇంకోవైపు రాజకీయాలను శాసిస్తున్నాడని చెప్పొచ్చు.

3. ముకేశ్ అంబానీ

భారతదేశంలో రూపాయికి మారుపేరు అంబానీ కుటుంబాన్ని వర్ణిస్తుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చేయి పడని బిజినెస్ లేదు, లాభాలు పొందని రంగం లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 63 ఏళ్ల ఈ బిజినెస్ టైకూన్ ఒకప్పుడు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువును మధ్యలోనే వదిలేశారు. తర్వాత 1970ల్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారనుకోండి. ఈయన ఆస్తి 78.6 బిలియన్ డాలర్లు.

4. జార్జియో అర్మానీ

ఈ పేరు వినగానే ఫ్యాషన్ ప్రపంచంలో ఒక బ్రాండ్ గుర్తొస్తుంది. అంతలా ముద్ర పడేలా అర్మానీ బ్రాండ్‌ను ఆయన ప్రాచుర్యం చేశారు. 86 ఏండ్ల జార్జియో అర్మానీ 8.5 బిలియన్ డాలర్ల ఆస్తిపరుడు. ప్యాసెంజా యూనివర్సిటీ నుంచి మెడికల్ చదువును జార్జియో మధ్యలోనే వదిలేశారు. అయితే, ఆయన వదిలేసింది అర్మానీ బ్రాండ్ కోసం కాదు, మిలటరీలో చేరడానికి. తర్వాత 1970 దశకంలో మిలాన్‌లో జార్జియో అర్మానీ స్పాను స్థాపించారు.

5. జాక్ డోర్సీ

43 ఏండ్ల ఈ ట్విట్టర్ సీఈవో ఆస్తి 8.5 బిలియన్ డాలర్లు. ఈయన రెండు సార్లు కాలేజీ నుంచి డ్రాప్ అయ్యారు. మొదటగా మిస్సోరీ యూనివర్సిటీ నుంచి, రెండో సారి న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి జాక్ డోర్సీ చదువు మానేశారు.

ఈ ఐదుగురి గురించి చదివి, రేపట్నుంచి మాకు చదువు అవసరం లేదు అనే పిచ్చి ప్రయత్నాలు పెట్టుకోకండి. వారు డ్రాప్‌అవుట్ అయింది ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి, ఏదో గల్లీలో కొత్తగా పెట్టిన యూనివర్సిటీ నుంచి కాదు. కాబట్టి ముందు హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో స్థానం సంపాదించుకునేంత నాలెడ్జ్ పెంచుకుని తర్వాత చదువును వదిలేసినా తప్పులేదు.

Advertisement

Next Story

Most Viewed