బీరూట్ పేలుడులో 135 మంది మృతి

by vinod kumar |
బీరూట్ పేలుడులో 135 మంది మృతి
X

బీరూట్: లెబనాన్ రాజధానిలో మంగళవారం నాటి భారీ పేలుడులో కనీసం 135 మంది చనిపోయారు. ఐదు వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. శిథిలాల కింద మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతున్నది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. దీంతో నగరమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. కనిపించని తమ ఆప్తుల కోసం గాలింపులు, ఫోన్ నెంబర్లు, ఆప్తుల ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసుకుంటున్నారు.

రక్షణ చర్యలకు ఆటంకం కలగకుండా ఉండటానికి లెబనీస్ ప్రభుత్వం దేశంలో రెండు వారాలపాటు ఎమర్జెన్సీని విధించింది. బీరూట్‌కు సహాయంగా కువైట్, నార్వే, ఆస్ట్రేలియాలు ముందుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్ ఎమర్జెన్సీ వర్కర్లను, రక్షణ పరికరాలను సిద్ధం చేస్తున్నది. మంగళవారం బీరూట్ పోర్టు ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. పేలుడు ప్రభావం సగం నగరాన్ని ప్రభావితం చేసిందని బీరూట్ గవర్నర్ మర్వాన్ అబ్బౌడ్ తెలిపారు.

నష్టం మూడు బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. ఈ పేలుడు దేశంలోని 85శాతం ఆహార ధాన్యాలను నాశనం చేసింది. పోర్టుకు సమీపంలోని గోదాములూ ధ్వంసం కావడంతో ఈ నష్టం చోటుచేసుకుంది. పోర్టు ఏరియా గోదాముల్లోని గోధుమలను తినరాదని దేశ ఆర్థిక మంత్రి తెలిపారు. తొలుత ఈ పేలుడు ఉగ్రవాద చర్యపై అనుమానాలు వచ్చాయి.

కానీ, ఈ పేలుడుకు కారణం నిల్వచేసిన అమోనియం నైట్రేట్ అని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సాగు ఎరువులో, పేలుడు పదార్థాల్లో వినియోగించే అమోనియం నైట్రేట్ కొన్నేళ్లుగా పోర్టు ఏరియాలోని వేర్ హౌజ్‌లో నిల్వచేశారు. సుమారు 2,700 టన్నుల అమోనియం నైట్రేట్ ఈ పేలుడు కారణమని ప్రధాని హసన్ దాయబ్ తెలిపారు. ఈ పేలుడుకు కారణమైనవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వేర్ హౌజ్‌లో ఈ పేలుడుపదార్థాలను నిల్వ చేయడం సరికాదని కొందరు అధికారులు వాదించారు. అయితే, కొందరి అలసత్వం కారణంగా అమోనియం నైట్రేట్ అక్కడే ఉండిపోయింది.

Advertisement

Next Story