- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యమేలుతున్న బెగ్గింగ్ మాఫియా!
దిశ, కుత్బుల్లాపూర్: నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బెగ్గింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. అభం.. శుభం తెలియని చిన్నారులచే భిక్షాటన చేయిస్తోంది. చదువుకోవాల్సిన వయసులో పుస్తకాలు, పెన్నులు పట్టుకోవాల్సిన ఆ చేతులు మాస్కులు, ఇర్ బడ్స్ పట్టుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పసిపిల్లలను నగరానికి తరలించి వారిచే వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. చౌరస్తాల్లో ఉంచి వారిచే బిచ్చమెత్తిస్తూ దందాలు నిర్వహిస్తున్నారు. పసిపిల్లల బాల్యాన్ని మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
అమ్మ.. నాన్న.. అంటూ చేతిలో గిలకలతో బుడి బుడి అడుగుల తప్పటడుగులు వేయడం. వచ్చీ రాని మాటలతో నలుగురినీ కవ్విస్తూ నవ్వించే వయసు వారిది. కానీ వారంతా అమ్మా నాన్నల ప్రేమలకు దూరమై బిచ్చమెత్తుకుంటున్నారు. ఉదయం 5.30 గంటలకు (ఆర్‌జే 05 జీబీ 0180) నెంబరు గల గూడ్స్ వాహనం బోయిన్‌పల్లిలోని గుడిసెలుండే చోటకు వచ్చి హారన్ కొడుతుంది. ఐదు నిమిషాల్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి అందులో కూర్చోవాల్సిందే. ఆరున్నర గంటల వరకు ప్రధాన చౌరస్తాల్లో దింపడం ఆ వాహనదారుడి పని.
ఆ తర్వాత వారికి కొన్ని పెన్నులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మాస్కులు, ఇయర్ బడ్స్.. తదితర వస్తువులను అప్పగించి విక్రయించాలని ఆదేశిస్తారు. వస్తువుల అమ్మకం పూర్తయితే అడుక్కోవాలని బెదిరిస్తారు. ఒక వేళ వస్తువులన్నీ అమ్ముడు పోకుంటే రాత్రి భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తారు. ఇలా రాత్రి 10 గంటల వరకు వీరిచే నానా చాకిరీ చేయిస్తూ ఉంటారు. అయ్యా.. మాకు అమ్మా నాన్నలు లేరు.. ఆకలేస్తుంది.. అన్నం లేదు సారూ.. అంటూ కారు అద్దాలు తుడుస్తుంటారు. వాహనదారుల కాళ్లు పట్టుకుంటూ ధర్మం చేయండి బాబూ.. అంటూ ప్రాధేయపడతారు. ఇలా అభం.. శుభం తెలియని చిన్నారులతో వెట్టిచాకిరితో పాటు భిక్షాటన చేయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ముఠాలు నగరంలో అనేకం ఉన్నాయి.
సమయం ఉదయం 6.30 గంటలైతే చాలు.. ఓ పక్క మున్సిపల్ కార్మికులు రోడ్లు ఊడుస్తుంటారు. మరో పక్క జనాలు రాకపోకలు సాగిస్తుంటారు. అప్పుడే ఐదేండ్లు కూడా దాటని చిన్నారులు కండ్లు నులుముకుంటూ.. చిరిగిన బట్టలతోనే రోడ్లపైకి వస్తుంటారు. వారిని చూసిన వారు మానవతా వాదులైతే ఎంతో కొంత ఇస్తారు.. కొందరు చీదరించుకుని వెళ్తుంటారు. మరికొందరైతే జాలితో పిల్లలకు తినుబండారాలు, ఆట వస్తువులు ఇస్తుంటారు. ఆటబొమ్మలు, తినుబండారాలు తీసుకుంటే ముఠా సభ్యులచే దెబ్బలు తినాల్సిందే. ఇదంతా చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ముఠాలను పట్టుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ ఉన్నతాధికారులు భిక్షాటన చేసే వారిని గుర్తించి చదువుకునే వారిని చదివించడం, పని చేసే వయసు గల వారికి ఉపాధి చూపుతున్నామని లెక్కలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం కన్పించడం లేదు. ఈ ముఠా నగరంలోనే ఉండేదని, ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, బాచుపల్లి, షాపూర్ నగర్ చౌరస్తాల్లోకి కూడా విస్తరించింది. నగర శివారులో అయితే అధికారులు పట్టించుకోరనే ఉద్దేశంతో ఈ ముఠా దందా మూడు పూలు, ఆరుకాయలుగా విరాజిల్లుతోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ ముఠా సభ్యులే భిక్షాటన చేసే పిల్లలను చిన్న, చిన్న హోటళ్లు, కంపెనీల్లోనూ రోజువారి కూలీలుగా పనులు చేయిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయించడం వల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడడమే కాకుండా వీధి దొంగతనాలకు కూడా పాల్పడే అవకాశముంది. రాబోయే రోజుల్లో వీరంతా వీధి రౌడీలుగా కూడా మారే అవకాశముంది.
అడ్డుకట్ట వేయాలి..
చిన్న పిల్లలతో నీచమైన పనులు చేయిస్తుండడం బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం సిగ్గుచేటు. ఈ బెగ్గింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయలేమా..? ఈ రోజులు ఎప్పడు మారుతాయో అర్థం కావడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి చిన్నారులతో పాటే పేదలైన పెద్దలకు విముక్తి కలిగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అభాగ్యులను ఆదుకోవాలి: బెల్లంకొండ పూర్ణచంద్రరావు హైకోర్టు అడ్వకేట్
ప్రభుత్వం ఇలాంటి వారిని చేరదీసి ప్రయోజకుల్ని చేస్తామని చెబుతోంది. కానీ పూర్తిగా ఆచరణలో పెట్టడం లేదు. పోలీసులు, మున్సిపల్, స్వచ్ఛంద సంస్థలతో పాటు అందరి సహకారంతో ఇలాంటి వారికి దారి చూపాలి. పెద్దలైతే ఏమైనా ఉపాధి కల్పించాలి. ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కార్యాచరణ చేపట్టి అభాగ్యులను ఆదుకోవాలి.
వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పిస్తాం జ్యోతిపద్మ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, మేడ్చల్ జిల్లా
పిల్లలచే వెట్టిచాకిరి చేయిస్తున్న ముఠాను పట్టుకునేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, యూనిట్ సభ్యులందరిని అప్రమత్తం చేస్తాను. పిల్లలకు విముక్తి కల్పిస్తాం. దత్తత తీసుకుని వారికి ఇష్టమైన విధంగా పెరిగేలా చూస్తాం.
దందాను అరికడతాం మమత, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
ఎలాంటి ఆవాసం లేని వారికి ఆవాసం కల్పిస్తాం. పిల్లలచే భిక్షాటన చేయిస్తున్న ముఠా గూర్చి సంబంధిత చైల్డ్ వెల్ఫేర్, పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్తాను. ఈ దందాను అరికడతాం.