షెల్టర్ హోంకు 60మంది యాచ‌కుల‌ తరలింపు

by Shyam |   ( Updated:2020-04-21 05:34:40.0  )
షెల్టర్ హోంకు 60మంది యాచ‌కుల‌ తరలింపు
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఉన్న‌ యాచకులకు షెల్టర్ హోంలలో వసతి కల్పించి, భోజనం అందిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మంగళవారం సెక్రటరియేట్ ముందు ఉన్న 60 మంది యాచకులను గుర్తించి, 108 వాహనాల ద్వారా అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్‌‌ తరలించారు. అదే సమయంలో యాచకులకు అన్నదానం చేసేందుకు వచ్చిన కార్తీక్, అతని స్నేహితులతో మాట్లాడి, ఇక నుంచి రోడ్లపై అన్నదానం చేయొద్దని సూచించారు. ఆసక్తి ఉంటే షెల్టర్ హోంలలో అధికారుల ద్వారా మాత్రమే అన్నదానం చేయాలన్నారు. కార్తీక్, మిత్రులు తెచ్చిన భోజనం నాణ్యతను పరిశీలించి, అభినందించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాయాలని కోరారు. ప్రభుత్వం నుంచి బియ్యం, నగదు తీసుకొని దాత‌లు పెట్టే భోజ‌నానికి బయటకు వచ్చే వారిపై కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్లు హెచ్చ‌రించారు.

లాక్‌డౌన్ వల్ల నగరంలో ఏ వ్యక్తి ఆకలితో అలమటించరాదని ఉచితంగా అన్నపూర్ణ భోజనం పెడుతున్నట్లు తెలిపారు. అనాథలు, నిరాశ్రయులు, యాచకులకు ఆశ్రయం కల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ద్వారా 25షెల్ట‌ర్ హోంలు నడుపుతున్నామని, ఎన్‌.జి.ఓల స‌హ‌కారంతో 85చోట్ల ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న‌ట్లు స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో దాదాపు 400 మంది యాచ‌కులు ఉన్నార‌ని, వారంద‌రినీ షెల్ట‌ర్ హోంల‌కు తరలిస్తామన్నారు. అదేవిధంగా న‌గ‌రంలోని యాచ‌కుల‌ను గుర్తించి స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. రెండు రోజుల్లోనే 200మందిని షెల్ట‌ర్ హోంల‌కు త‌ర‌లించిన‌ట్లు వివ‌రించారు.

Tags: beggars, Home Shelters, Ameerpet, Secretariat, Annapurna Meals, Hyderabad, GHMC Mayor, Bonthu Rammohan

Advertisement

Next Story

Most Viewed