సముద్ర తీరాల్లో చెత్త ఏరివేతకు రోబో!

by Shyam |   ( Updated:2021-08-02 05:17:49.0  )
Beach-cleaning-RoBot
X

దిశ, ఫీచర్స్ : నిత్యం టూరిస్టులతో సందడిచేసే సముద్ర తీరాల్లో చెత్త సేకరణ సమస్యగా మారింది. ప్రత్యేకించి ఇసుకలో కూరుకుపోయే ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. అయితే బీచెస్‌లోని చెత్త తొలగింపుకు అనేక ఎన్జీవోలు స్వచ్ఛందంగానే పని చేస్తున్నా.. చిన్న చిన్న ప్లాస్టిక్ అవశేషాలను కలెక్ట్ చేయడం కష్టమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే BeBot అనే రోబో డిజైన్ చేయబడింది. ఇది ఇసుకను జల్లెడపట్టి అందులోని వ్యర్థాలను సేకరిస్తోంది.

మెరైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాన్యుఫ్యాక్చరర్ సంస్థలు ‘పొరలు మెరైన్, 4 ఓషియన్’.. ఈ BeBotను రూపొందించాయి. పర్యావరణ వ్యవస్థలకు పెద్దగా అంతరాయం కలగకుండా తీరప్రాంతాలను శుభ్రపరిచేలా ఈ రోబో మెషిన్‌ను డిజైన్ చేశారు. నిజానికి మాన్యువల్ హ్యూమన్ సిఫ్టర్స్(మనుషులతో జల్లెడ పట్టించడం) ద్వారా ఎక్కువ మొత్తంలో చెత్తను తీయొచ్చు, కానీ ఇది శ్రమతో కూడుకున్న పని.

ఈ విషయంలో ట్రాక్టర్లు, ఇతర హెవీ డ్యూటీ యంత్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయగలిగినా.. వాటి వల్ల అక్కడి జంతు, వృక్షజాలం నాశనం కావచ్చు లేదా నేల కోతకు గురయ్యే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించబడ్డ ఈ ఎలక్ట్రిక్ రోబోట్(BeBot).. సోలార్, బ్యాటరీ పవర్ కలయికతో నడుస్తుంది. 300 m(984 ft) దూరంలో ఉన్న మానవ ఆపరేటర్ ద్వారా రిమోట్‌ సాయంతో నియంత్రించబడుతుంది.

ఇది ఇసుకలో 10 సెం.మీ (4 అంగుళాలు) వరకు త్రవ్వి.. ఇసుకలోని ప్లాస్టిక్ ముక్కలు, సెంటీమీటర్ పరిమాణం కన్నా చిన్నగా ఉండే సిగరెట్ వంటి ఇతర అవశేషాలను సేకరించి వాటిని మెష్ స్క్రీన్ ద్వారా యాంత్రికంగా జల్లెడ పడుతుంది.

ఈ రోబో యంత్రం గంటకు 3వేల చ.మీ (32వేల చ.అ) విస్తీర్ణంలో బీచ్‌ను శుభ్రపరుస్తుంది. నేల స్వభావాన్ని బట్టి ఈ సమయం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. హోటల్స్, బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీస్, ప్రకృతి ప్రదేశాలు, గోల్ఫ్ కోర్సుల్లోనూ దీని ఉపయోగం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ఫ్లోరిడా బీచెస్‌లో పరీక్షించబడుతోంది. త్వరలోనే క్లీనింగ్ యాక్టివిటీ చేపట్టేందుకు హవాయ్‌కు పంపే యోచనలో కంపెనీ ఉంది.

Advertisement

Next Story

Most Viewed