పబ్జీలో రాణించాలంటే ఎలా?

by Shyam |
పబ్జీలో రాణించాలంటే ఎలా?
X

పబ్జీ మొబైల్ గేమ్.. టీనేజర్లు, యువకులతో పాటు కొంతమంది పెద్ద వాళ్లకు కూడా పరిచయమక్కర్లేని పేరు. ఆ ఆట ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే వాళ్లు ఆడటం రాక ప్రాణాలు కోల్పోయారా? లేదు.. బాగా ఆడగలిగితే ఆ ఆటలో వచ్చే మజానే వేరు. అందుకే ఆ మజా కోసం ఆట ఆడి ఆడి అంతిమ శ్వాస విడిచారు. ర్యాంక్‌ల ఆధారంగా గేమ్ పనితీరును అంచనా వేసే ఈ ఆటలో ర్యాంకులదే ప్రధాన పాత్ర. అందుకే చదువులో ర్యాంకుల కంటే పబ్జీలో ర్యాంకుల కోసం పిల్లలు ఎక్కువ కష్టపడుతున్నారు. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్, క్రౌన్, ఏస్, చివరగా కాంక్వెరర్ అని ర్యాంకులు ఉంటాయి. ఇందులో కాంక్వెరర్ ర్యాంకు సంపాదించడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ మధ్య పబ్జీ టోర్నమెంట్‌లు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా పబ్జీ టోర్నమెంట్‌లలో పాల్గొని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అందుకోసం కొన్ని టిప్స్ ఇవిగోండి!

జాగ్రత్త అవసరం..

ర్యాంక్‌లు ఇచ్చే మ్యాచ్‌లో ఆడుతున్నపుడు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఏస్ టియర్‌లో ఆడే ప్లేయర్లు అందరూ చాలా అనుభవజ్ఞులై ఉంటారు. అందుకే ఏ చిన్న తప్పు చేసినా దాన్ని వాళ్ల విజయం కోసం ఉపయోగించుకుంటారు. కాబట్టి తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం అవసరం. ఒకవేళ మీకు ప్రత్యర్థి జట్టు లొకేషన్ ముందే తెలిస్తే మాత్రం నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం లేదు. వెళ్లి దుమ్ముదులపడమే!

ఎయిర్‌డ్రాప్స్ పడగానే వెళ్లొద్దు..

పబ్జీ గేమ్‌లో ఎయిర్‌డ్రాప్స్‌లో కావాల్సిన సప్లైస్ దొరుకుతాయి. అవి విమానం నుంచి పడగానే వాటి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లొద్దు. ఏదో కరువు ప్రాంతంలో ఉన్నవాళ్లకు పులిహోర పొట్లాలు పడేసినట్లుగా సప్లైస్ కోసం పరిగెత్తకూడదు. ఎందుకంటే అదే జోన్‌లో ఉన్న ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా అక్కడికే పరిగెత్తుకుంటూ వస్తారు. ఒకవేళ వాళ్లు గనక ముందే వచ్చి దాక్కుంటే మాత్రం, మీరు రావడాన్ని పసిగట్టి కాల్చిపడేసే అవకాశం ఉంటుంది. అందుకే ముందు ఆ ఎయిర్‌డ్రాప్ చుట్టుపక్కలా ఎవరన్నా ఉన్నారా లేదా అని చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది.

జట్టుతో కలిసి ఉండాలి..

ఒక్కరిగా పోరాడటం కంటే జట్టుగా పనిచేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు. పబ్జీలో కూడా అంతే.. టీమ్‌లో ఉన్న వారి సామర్థ్యాలను అంచనా వేయగలిగి చక్కగా కోఆర్డినేట్ చేసుకోగలగాలి. డైమండ్ ఆకారంలో టీమ్ మొత్తం కదులుతూ అన్ని కోణాలను కవర్ చేయాలి. కదులుతున్నపుడు లేదా శత్రువుల కాల్పులను తట్టుకుంటున్నపుడు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తూ స్ట్రాటజీలను బేరీజు వేసుకోవాలి.

ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి..

ఒక్కసారి ప్రయత్నించినపుడే ఏదీ రాదు. పబ్జీ విషయంలో కూడా అంతే. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఆడవచ్చు. మంచి ర్యాంకులో నిలవవచ్చు. రోజూ గంటలకొద్దీ ఒకే రకంగా ఆడుతూ ప్రాక్టీస్ చేయడం కాకుండా వెపన్స్, సినారియోలు, ట్రైనింగ్ గ్రౌండ్స్, వాటిలో లోటుపాట్ల గురించి అధ్యయనం చేసేలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత జట్టుగా ఆడుతున్నపుడు మీ నాలెడ్జిని బృందంతో పంచుకోవాలి.

దాక్కుని కాల్చడం నేర్చుకోండి..

ఒకచోట దాక్కుని మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటూ శత్రువులను చంపడం నేర్చుకుంటే పబ్జీ గేమ్‌లో మంచి ప్లేయర్‌గా మారవచ్చు. ఇందుకు పబ్జీలోనే పీక్ అండ్ ఫైర్ అనే ఆప్షన్ ఉంటుంది. గేమ్ సెట్టింగ్‌లకు వెళ్లి బేసిక్ కేటగిరీలో ఉన్న పీక్ అండ్ ఫైర్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఈ సదుపాయం మీకు అందుబాటులోకి వస్తుంది. ఇక గేమ్‌లో ఉన్నపుడు కదలిక కంట్రోల్స్ పైన ఉన్న పీక్ అండ్ ఫైర్ బటన్ నొక్కి, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే శత్రువులు మిమ్మల్ని కనిపెట్టేలోగా మీరు వాళ్లని హతమార్చవచ్చు.

Advertisement

Next Story

Most Viewed