మెస్సీ జీతం ఏడాదికి ఎంతో తెలుసా..?

by Shyam |
మెస్సీ జీతం ఏడాదికి ఎంతో తెలుసా..?
X

దిశ, స్పోర్ట్స్ : స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన బార్సిలోనా.. ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీకి భారీ మొత్తం వేతనం చెల్లిస్తున్నట్లు ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది. నాలుగు ఏళ్లకు 673 మిలియన్ డాలర్లు (రూ. 4906 కోట్లు) చెల్లిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నది. మెస్సీ ఏడాదికి రూ. 1217 కోట్ల వేతనం అందుకుంటే ప్రపంచంలోనే అత్యంత భారీ జీతాన్ని అందుకుంటున్న క్రీడాకారుడిగా రికార్డు సృష్టించినట్లు సమాచారం. 2017లో బార్సిలోనా మెస్సీతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను స్పానిష్ డైలీ ‘ఎల్ మోండే’ మొదటి పేజీలో ప్రచురించింది.

మెస్సీకి నాలుగు సీజన్లకు గానూ మొత్తం 55,52,37,619 యూరోలు చెల్లిస్తున్నారు. ప్రతీ సీజన్‌కు 138 మిలియన్ యూరోలతో పాటు ఇతర అలవెన్సులు మెస్సీకి అందుతున్నాయి. దీంతో పాటు బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందాన్ని రెన్యూవల్ చేసుకున్నందుకు గాను 11,52,25,000 యూరోలు రెన్యూవల్ ఫీజు కింద చెల్లించింది. దీంతో పాటు 7,79,29,955 యూరోలను లాయల్టీ బోనస్ చెల్లించినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అయితే మెస్సీ సంపాదనలో సగం ట్యాక్సుల రూపంలో స్పెయిన్ ప్రభుత్వానికి చెల్లిస్తుండటం గమనార్హం.

కాగా, ఒక వ్యక్తితో చేసుకున్న వ్యక్తిగత ఒప్పందానికి చెందిన డాక్యుమెంట్‌ను అక్రమంగా సంపాదించడమే కాకుండా దాన్ని మీడియాలో బహిర్గతం చేసినందుకు గాను ‘ఎల్ మోండో’ పత్రికపై బార్సిలోనా క్లబ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హక్కులకు భంగం కలిగిస్తూ, ప్రొఫెషనల్ ఒప్పందాన్ని ప్రచురించినందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇలా ప్రచురించడం ఫుట్‌బాల్ క్లబ్, మెస్సీ పరువుకు భంగం కలిగించడమే అని పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed