అన్నికేంద్రానికి పంపుతున్నా: చంద్రబాబు

by Anukaran |   ( Updated:2020-07-25 07:54:09.0  )
అన్నికేంద్రానికి పంపుతున్నా: చంద్రబాబు
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులతో చర్చించి, వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా ప్రముఖ ఆస్పత్రుల డాక్టర్లతో చంద్రబాబునాయుడు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

గత రెండు వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందని అన్నారు. మరణాల్లో దేశంలోనే రెండో స్థానంలోకి ఎగబాకిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణకు ఇంకా మందులు లేని నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధానమైన మందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ సోషలైజేషన్, భౌతిక దూరం రెండూ అత్యంత కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ మందిని ఒకే అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలిస్తున్నారని, ఇది ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. దీని కారణంగా కరోనా లేని వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అలాగే అంబులెన్సులతో పాటు ఆస్పత్రుల్లో కూడా శానిటైజేషన్ అత్యంత కీలకమైనదని ఆయన గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 15న కరోనా మృత యోధులకు నివాళులు అర్పిద్దామని ఆయన కూడా పిలుపునిచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగిన వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని ఆయన సూచించారు. కరోనా మృతులకు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వేరే ఏ అత్యవసర చికిత్స అవసరం అయినా కరోనా పరీక్ష చేసి కానీ వైద్యం అందించడంలేదని, మరోవైపు ఈ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని, ఇది ఇతర రోగుల ఆరోగ్యాలను మరింత దిగజారుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed