అనాథాశ్రమంపై ఐశ్వర్య కేసు.. శ్రీదేవి బిడ్డను రక్షించిన పోలీసులు

by Anukaran |
అనాథాశ్రమంపై ఐశ్వర్య కేసు.. శ్రీదేవి బిడ్డను రక్షించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: అనాథాశ్రమంలో పిల్లల అదృశ్యం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తమిళనాడులోని మధురై జిల్లాలో ఇదయం ట్రస్టులో ఏకంగా 16 మంది పిల్లలు అదృశ్యమైన సంగతి కలకలం రేపుతోంది. ఏడుగురు ట్రస్టు సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొత్తం 50 మందికి పైగానే పిల్లలు మిస్సింగ్ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్టు నిర్వాహకుడు శివకుమార్, మదర్షాలు పిల్లలను అమ్మకానికి పెట్టినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. పిల్లలను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేశారు మధురై పోలీసులు.

ఐశ్వర్య ఫిర్యాదుతోనే..

ఇదయం ట్రస్టులో జరుగుతున్న పిల్లల అమ్మకాలు.. మధురై జిల్లా వేలూరు మండలం సేక్కిపెట్టికి చెందిన ఐశ్వర్య అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడ్డాయి. ఇటీవల భర్తను కోల్పోయిన ఐశ్వర్య(22)కు తన ముగ్గురు పిల్లల పోషణ భారమైంది. ఈ నేపథ్యంలోనే సమీపంలోని ఇదయం ట్రస్టు నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చేర్పించింది. చేర్పించిన కొద్ది రోజులకే తన చిన్న కుమారుడు మాణిక్కం అనాథాశ్రమంలో కనిపించలేదు. దీంతో ట్రస్టు సభ్యులను ఆరా తీయగా కరోనా వచ్చిందని.. ఆరోగ్యం క్షీణించి జూన్ 13న మరణించాడని సమాధానం దాట వేశారు. అంతేకాదు, ఓ ఫేక్ కొవిడ్ డెత్ సర్టిఫికేట్ కూడా సృష్టించి నమ్మబలికారు.

ట్రస్టు సభ్యుల కదలికలపై అనుమానం వచ్చిన ఐశ్వర్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ఐశ్వర్య కొడుకు మాణిక్కం, శ్రీదేవి అనే మరో మహిళ బిడ్డను కూడా అమ్మినట్టు తేలింది. మధురై జిల్లాలోని ఇస్మాయిల్‌పురానికి చెందిన కన్నన్‌, భవాని దంపతులకు రూ.5 లక్షలకు మాణిక్కంను విక్రయించారని పోలీసులు గుర్తించారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారులను సొంత తల్లిదండ్రులకు అప్పగించారు.

అనంతరం ట్రస్టు నిర్వాహకుడు శివ కుమార్, మదార్షాలతో పాటు మరో ఐదుగురు ట్రస్టు సభ్యులను ముందుగా అరెస్ట్ చేసిన పోలీసులు.. చిన్నారులను కొనుగోలు చేసిన సక్కుబాయ్‌, సాదిక్‌… కన్నన్‌, భవానీ దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు మొత్తం 16 మంది పిల్లలు అదృశ్యమయ్యారని తెలుస్తున్నా.. మరో 50 మందికి పైగానే పిల్లలను అమ్మినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదయం ట్రస్టు ఆశ్రమానికి సీల్ వేసిన అధికారులు.. అందులో ఉన్న 38 మంది పురుషులు, 35 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులను ఇతర అనాథాశ్రమాలకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed