ఆ యువకుడి ప్రతిభ అద్భుతం.. పార్లే-జి బిస్కెట్లతో రామమందిర నిర్మాణం..

by Sumithra |   ( Updated:2024-01-17 09:10:57.0  )
ఆ యువకుడి ప్రతిభ అద్భుతం.. పార్లే-జి బిస్కెట్లతో రామమందిర నిర్మాణం..
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది రామభక్తులు తమ భక్తిని అపూర్వంగా చాటుకుంటున్నారు. కొందరు శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరగా, మరికొందరు రామమందిరం కేక్‌ను తయారు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు బిస్కెట్లతో రామ మందిరాన్ని నిర్మించి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఛోటాన్ ఘోష్ అనే యువకుడు 20 కిలోల పార్లే - జి బిస్కెట్లను ఉపయోగించి 4 అడుగుల రామమందిర ప్రతిరూపాన్ని రూపొందించారు. ఈ మందిరాన్ని తయారు చేయడానికి ఐదు రోజులు పట్టిందని వారు తెలిపారు. ఈ రెప్లికాలో బిస్కెట్లే కాకుండా థర్మాకోల్, ప్లైవుడ్, జిగురు కూడా వాడారని వారు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అయిన వీడియోలో, ఒక యువకుడు బిస్కెట్లతో ఆలయం ప్రతిరూపాన్ని తయారు చేయడం చూడవచ్చు. రామ మందిరం ఈ అందమైన ప్రతిరూపం వీడియోని @durgapur_times అనే ఖాతాలో Instagram లో షేర్ చేశారు.

మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు కోట్ల సార్లు వీక్షించగా, 26 లక్షల మందికి పైగా వ్యూవర్స్ లైక్ చేశారు. అదే సమయంలో కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు యువకుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story