ధార్మిక క్షేత్రంలో శ్రమదోపిడి.. సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు ఆగ్రహం

by srinivas |
ధార్మిక క్షేత్రంలో శ్రమదోపిడి.. సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు ఆగ్రహం
X

దిశ రాయలసీమ : టీటీడీ అధికారులు లక్షలాది రూపాయల వేతనం తీసుకుంటూ మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న అటవీ కార్మికులకు పది వేల రూపాయల వేతనంతో సరిపెట్టడం శ్రమదోపిడి కాక మరేమిటని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ బృందా కారత్ అన్నారు. తిరుపతి టీటీడీ అటవీ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కొరకు పది నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికుల శిబిరం వద్దకు వచ్చిన బృందాకరత్ కార్మికులకు తన సంఘీభావాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ 14 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు, 8 టన్నులకు పైగా బంగారం, వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగిన టీటీడీ తన వద్ద దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేయడం అన్యాయమని విమర్శించారు. సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిన టీటీడీ ఇలాంటి ధార్మిక సంస్థలో కూడా అమలు కాకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే మూడు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారని, టీటీడీ బోర్డు టైం స్కేల్ ఇస్తామని తీర్మానించినా అమలు కాకపోవడానికి కారణాలు ఏమిటి? అని తీవ్రంగా ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా భక్తులు కోట్లాది రూపాయల విరాళాలు సమర్పిస్తుంటే టీటీడీ యాజమాన్యానికి ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవడానికి కాదని, భక్తులు ప్రజలు, కార్మికుల సంక్షేమం పై యాజమాన్యం మర్చిపోకూడదని హితవు పలికారు. టీటీడీ నిర్ణయాల అమలు కొరకు కార్ 299 రోజులుగా నిరాహార దీక్షలు చేయాల్సి రావటం దురదృష్టకరమని,ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని వ్యాఖ్యానించారు.

ప్రజలు భక్తుల గురించి పట్టించుకోమని అనేకమంది కోరుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 81 మందితో జంబో టీటీడీ బోర్డును ప్రకటించడం సిగ్గుచేటని ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా కార్మికుల గురించి పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని బృందాకరత్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన పోరాటం 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నాడు అటవీ కార్మికులతో భారీ నిరసన తెలియజేయనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. నాగరాజు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ జయ చంద్ర సీఐటీయు జిల్లా అధ్యక్షులు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, టి. సుబ్రహ్మణ్యం, ఆర్ లక్ష్మి, నాగ వెంకటేష్, చిన్నా, జయంతి సుజాత, హరి కేశవ్ హరికృష్ణ, పద్మజ, సురేష్, సురేంద్ర కృష్ణ, మునికృష్ణ కేశవులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story