అధ్వానంగా రోడ్లు.. పట్టించుకోని అధికారులు

by Sridhar Babu |   ( Updated:2021-10-17 04:57:58.0  )
అధ్వానంగా రోడ్లు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, శంకర్ పల్లి : గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వానంగా తయారు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల దుస్థితి ఏ మాత్రం మారడం లేదు. రోడ్ల మరమ్మతు, కొత్త రోడ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా వాస్తవంగా మాత్రం గ్రామీణ రోడ్లలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడి దోస్ వాడ నుంచి తిరుమలాపూర్ వెళ్లే మూడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా తయారై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోందని తిరుమలాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి నాలుగు పదుల దూరంలో ఉన్న షాబాద్ మండలంలో రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.కోటి 83 లక్షలు మంజూరు కావడంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మూడు నెలల క్రితం భూమి పూజ చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి మంత్రి ప్రారంభించి మూడు నెలలు దాటినా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించలేదు.

బురదమయంగా తిరుమలాపూర్ రోడ్డు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రేగడి దోస్ వాడ నుంచి తిరుమలాపూర్ వెళ్లే రోడ్డు బురదమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. వర్షాలు కురవడంతో వాహనాలు వెళ్ళ లేక పోతున్నాయి. తరచూ ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని గ్రామస్తులు రామచంద్రా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, రంగారెడ్డి , భాస్కర్ రెడ్డి, జనార్ధన్, రాజు, సత్తయ్య తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి..

రేగడి దోస్ వాడ నుంచి తిరుమలాపూర్ వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డు అధ్వాన్నంగా తయారయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా తయారై వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ రహదారి పై ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తోందని వాహనదారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసినా.. పనులు ప్రారంభించడం‌లో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలి.

తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed