కొవిడ్ ఆసుపత్రులపై ఆడిట్ అస్త్రం..

by Shyam |   ( Updated:2021-06-03 07:22:17.0  )
corporate hospitals
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ ఆసుపత్రుల దోపిడికి చెక్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయాత్తమైంది. జిల్లాలో కొవిడ్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వెల్లువలా వస్తుండగా, వాటికి నోటీసులు ఇచ్చిన అధికార యంత్రాంగం వాటిపై చర్యలు తీసుకునేందుకు పకడ్బందీగా సిద్ధమైంది. జిల్లాలో 56 కొవిడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో టాస్క్ ఫోర్స్ టీంలు, మానిటరింగ్ టీంల ద్వార తనిఖీలను పూర్తి చేసింది. ఇప్పుడు ఆసుపత్రులలో వాడిన రెమిడెసివిర్ ఇంజెక్షన్ లెక్కలను తెల్చనున్నారు. దానికి తోడు వెంటిలేటర్ ల వినియోగం, ఐసియూ పడక గదులు వినయోగంతో పాటు ఆక్సిజన్ వాడుకల గురించి ఆరా తీయనున్నారు.

ఆసుపత్రులలో రోగులకు ఇచ్చిన బిల్లులకు సంబంధించిన రషీదులను పరిశీలించనున్నారు. దానికి గాను కొవిడ్ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారి వివరాల ప్రకారం రోగుల ఇళ్లలో వారి నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టనున్నారు. దానికి జిల్లా అధికార యంత్రాంగం గతంలో టాస్క్ ఫోర్స్ టీంలు, మానిటరింగ్ టీంల మాదిరిగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్‌లో పరీక్షలు, వ్యాక్సినేషన్ లో బిజీగా ఉన్న వైద్యారోగ్యశాఖ ఈ కార్యక్రమంను ఇతర శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లేలా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రెపో మాపో ప్రత్యేక బృందాలు ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రులకు, కొవిడ్ బాధితుల ఇండ్లకు వెళ్లి వివరాలను తెలుసుకుని, ఆసుపత్రులు ఇచ్చిన లెక్కలతో సరిపోల్చి తేడా ఉంటే చర్యలు తీసుకోనున్నారు.

జిల్లాలో 16 కొవిడ్ ఆసుపత్రులకు నోటీసులు….

జిల్లాలో 56 ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రులకు గాను 16 కొవిడ్ ఆసుపత్రులకు నోటిసులను జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాల నరేంద్ర తెలిపారు. జిల్లాలో గురువారం వరకు 16 ఆసుపత్రులకు తాఖీదులు జారీ చేయగా 6 ఆసుపత్రులు మాత్రమే వివరణ ఇచ్చాయని తెలిపారు. మిగిలిన ఆసుపత్రులు ఇచ్చిన వివరణ ప్రకారం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. త్వరలో ఫిర్యాదులను అన్నింటినీ పరిశీలించి బాధ్యులైన అన్ని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని డీయంహెచ్ఓ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed