డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి

by Shamantha N |
డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
X

న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలోకి బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యంగా దూసుకెళ్లారని, అందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిధిలోని ఢిల్లీ పోలీసులు సహకరించారని ఆప్ ఆరోపించింది. మనీశ్ సిసోడియా, ఆయన కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు గేటు దగ్గర ప్రేక్షకపాత్ర వహించారని వ్యాఖ్యానించింది. మనీష్ సిసోడియా, ఆప్ లీడర్లు అతీషి, రాఘవ్ చద్దాలు ట్విట్టర్‌లో ఘటనకు సంబంధించిన వీడియోలు పోస్టు చేశారు. పదుల సంఖ్యలో వ్యక్తులు మనీశ్ సిసోడియా ఇంటివైపు పరుగెత్తుకెళ్లగా, సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నిమిత్తమాత్రంగా వ్యవహరించారు. కొందరు పోలీసులను పక్కకు తోసేశారు. వారంతా గేట్ తెరుచుకుని సిసోడియా ఇంటిలోకి దూసుకెళ్లారు.

ఇది బీజేపీ గూండాల పనేనని, అమిత్ షా పర్యవేక్షణలో దాడి జరిగిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలను టార్గెట్ చేయడం ఆందోళనకరమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ ఎందుకింత అసహనానికి లోనవుతున్నదని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలో బీజేపీ మేయర్లు, కార్పొరేటర్లను హత్యచేసే ఆప్ కుట్రకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన నిరసన శాంతియుతంగా ముగిసిందని బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షులు అశోక్ గోయల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed