స్వామి అగ్నివేశ్ అస్తమయం

by Anukaran |   ( Updated:2020-09-11 10:37:47.0  )
స్వామి అగ్నివేశ్ అస్తమయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్య సమాజ్ నాయకుడు, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల న్యూ ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి వెంటిలేటర్‌ పై ఉంచి డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. అయినప్పటికీ.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం ఆరు, ఆరున్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. ఓ ప్రియమైన నాయకుడిని దేశం కోల్పోయిందని వారు సంతాపం తెలిపారు.

అంతిమ దర్శనానికి ఆయన భౌతిక దేహాన్ని జంతర్ మంతర్‌లోని నివాసంలో శనివారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటలకు గురుగ్రామ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఎవరీ స్వామి అగ్నివేశ్:

1939 సెప్టెంబర్ 21న.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బ్రాహ్మణ సనాతన హిందూ కుటుంబంలో వేపా శ్యామ్ రావు (స్వామి అగ్నివేశ్).. జన్మించారు. నాలుగేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన అగ్నివేశ్ తాత సమక్షంలో పెరిగారు ఈ నేపథ్యంలోనే లా అండ్ కామర్స్ డిగ్రీ చేసిన అగ్నివేశ్.. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్‌లో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ తర్వాత సబ్యసాచి ముఖర్జీ దగ్గర లా ప్రాక్టీస్ చేశారు.

రాజకీయ ప్రయాణం:

ఆర్య సమాజ్ సిద్ధాంతాలతోనే అగ్నివేశ్ 1970లో ఆర్య సభ రాజకీయ పార్టీని స్థాపించారు. 1977 లో హర్యానా శాసనసభ సభ్యుడిగా ఎన్నికై.. 1979లో అదే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత 1981లో స్థాపించిన ‘బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్’ ఏర్పాటుతో అగ్నివేశ్ మంచి గుర్తింపు పొందారు.

ఆర్యసమాజ్‌ అధ్యక్షుడిగా:

ఆర్య సమాజ్ ప్రపంచ కౌన్సిల్ అధ్యక్షుడిగా అగ్నివేశ్ సుధీర్ఘకాలం (2004-14) సేవలందించారు. అంతేకాకుండా.. ఐరాస వాలంటరీ ట్రస్ట్ ఫండ్ చైర్ పర్సన్‌గా స్వామి అగ్నివేశ్ విధులు నిర్వర్తించారు. 2004లో రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు అందుకున్న అగ్నివేశ్.. స్వీడన్ నుంచి రైట్ లైవ్ లీ హుడ్ అవార్డుకు కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. బీజేపీ యువమోర్చా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ స్వామి అగ్నివేశ్ 2018లోనే చివరిసారిగా వార్తల్లో నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed