అసెంబ్లీలో ఆ సీటు ఖాళీ అయితదంట

by Anukaran |
అసెంబ్లీలో ఆ సీటు ఖాళీ అయితదంట
X

దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ్యుల సీటింగ్‌కు సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. సోషల్ డిస్టెన్స్ విధానానికి అనుగుణంగా కుర్చీల అమరికపై కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ ఉన్నందున సోషల్ డిస్టెన్స్ నిబంధన ప్రకారం కొత్త మార్పులు అనివార్యమవుతున్నాయి. దీంతో కొన్ని అదనపు కుర్చీలను సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరు 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సీటింగ్ అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పరిశీలన మొదలుపెట్టారు. గురువారం అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ తదితరులు సంయుక్తంగా పరిశీలించారు. సీటింగ్‌పై విస్తృతంగా చర్చించారు.

కరోనా నిబంధనలను పాటించాల్సి ఉన్నందున అసెంబ్లీ హాల్‌లో సీటుకు ఒకరు చొప్పున మాత్రమే కూర్చోవాలన్నది దాదాపు ఖరారైంది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో ఒక్కరు మాత్రమే కూర్చుంటారు. మొత్తం 78 మంది సభ్యులు కూర్చోవడం వీలవుతుంది. మరో 42 మంది సభ్యులకు సీటింగ్ సౌకర్యం ఉండదు. ఇందుకోసం చివరి వరుస వెనక కొత్తగా కుర్చీలను వేయడంపై చర్చ జరిగింది. ఇప్పుడున్న సీట్ల తరహాలోనే శాశ్వత ప్రాతిపదికన కొత్తగా 42 కుర్చీలను చివరి వరుస వెనకన ఏర్పాటు చేయాలనే ప్రాథమిక నిర్ణయం జరిగింది. దీనికి తోడు సందర్శకుల గ్యాలరీలో కూర్చునే అవకాశంపైనా చర్చ జరిగింది. అయితే సభ్యులు మాట్లాడడానికి మైక్ సౌకర్యం, కెమెరాల ఏర్పాటు, లైటింగ్.. ఇలా అనేక సాంకేతిక అంశాలు కొలిక్కి రావాల్సి ఉన్నందున హాలు లోపలనే సర్దుబాటు చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.

శాసనమండలిలో మధ్యలో సీటు ఖాళీ

శాసనసభలోని సీటింగ్ అంశంపై చర్చ అనంతరం శాసనమండలిలో కొవిడ్ నిబంధనల అమలుపై చర్చ మొదలైంది. గరిష్ఠంగా నలభై మంది ఎమ్మెల్సీలు ఏకకాలంలో కూర్చోడానికి సరిపోయేంత స్థాయిలోనే సీట్లు ఉన్నాయని చైర్మన్ భావించారు. ప్రస్తుతం పక్కపక్కనే కూర్చుంటున్నందున ఇకపైన కొవిడ్ నిబంధనలను అమలుచేసే క్రమంలో మధ్యలోని సీటును ఖాళీగా ఉంచాలని చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి నిర్ణయించారు. ఖాళీగా ఉంచాల్సిన సీటులో ఎవ్వరూ కూర్చోకుండా ప్రత్యేకంగా మార్కింగ్ వేశారు. దీనికి అనుగుణంగా సభ్యులకు ఏ నెంబర్ సీటు కేటాయించిందీ ప్రత్యేకంగా అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌లు సభ్యులకు తెలియజేస్తారు.

థర్మల్ స్కానర్లు

శాసనసభ, శాసనమండలి హాళ్లలోకి, లాబీల్లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్కానర్ ద్వారా స్క్రీనింగ్ చేయాలని, ప్రవేశమార్గం దగ్గరే శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అయితే మాన్యువల్‌గా థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి బదులుగా నిర్దిష్ట దూరం నుంచే ఆటోమేటిక్‌గా స్కానింగ్ చేసే పరికరాలను అమర్చడంపై చర్చ జరిగింది. అవి ఎలా పనిచేస్తాయో కూడా చైర్మన్, స్పీకర్, కార్యదర్శి పరిశీలించారు. అయితే ఏర్పాటు చేయడంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి తోడు అసెంబ్లీ ప్రాంగణమంతా వీలైనన్ని ఎక్కువచోట్ల కొవిడ్ నిబంధనలను వివరించే సైన్ బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, మాస్కు లేకుండా తిరగరాదనే అంశాన్ని నొక్కిచెప్పాలనే నిర్ణయం కూడా జరిగింది. సెప్టెంబరు 1వ తేదీకల్లా మొత్తం ఏర్పాట్లు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed