జోఫ్రా ఆర్చర్‌కు మళ్లీ తిరగబెట్టిన గాయం

by Shyam |
జోఫ్రా ఆర్చర్‌కు మళ్లీ తిరగబెట్టిన గాయం
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు గాయం తిరగబెట్టినట్లు తెలుస్తున్నది. ఇండియా పర్యటనకు వచ్చిన జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ ఆడకుండానే ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం తన సొంత కౌంటీ ససెక్స్ తరపున దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కెంట్‌తో జరిగిన మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు ఇచ్చి 2 వికట్లు తీశాడు. అయితే మోచేతి గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లకంటే ఎక్కువ బౌలింగ్ చేయలేక పోయాడు.

మూడో రోజు ససెక్స్ కెప్టెన్ బెన్ బ్రౌన్ బంతిని ఆర్చర్‌కు ఇచ్చి బౌలింగ్ చేయమని అడుగగా.. అతడు నిరాకరించాడు. తనకు చేతి గాయం తిరిగి నొప్పి పెడుతుండటంతో బౌలింగ్ చేయలేనని చెప్పుకొచ్చాడు. దీంతో కెప్టెన్ వేరే బౌలర్లతో బౌలింగ్ వేయించాడు. గాయం తిరగబెట్టడంలో జోఫ్రా ఆర్చర్‌కు మరిన్ని రోజులు విశ్రాంతి అవసరం అని ఈసీబీ భావిస్తున్నది. న్యూజీలాండ్, ఇండియాలతో కీలకమైన టెస్టు మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో ఆర్చర్‌కు మరికొన్ని రోజులు విశ్రాంతి కల్పించనున్నారు.

Advertisement

Next Story