- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముదురుతున్న వరల్డ్ కప్ ఫిక్సింగ్ వార్
దిశ, స్పోర్ట్స్: స్టేడియంలో వేలాది మంది, టీవీల ముందు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు చూస్తుండగా కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్స్ కొట్టి 28 ఏండ్ల తర్వాత భారత జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. ఇప్పటికీ అభిమానులు ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటుంటారు. కానీ, ఆ విజయం ఒక ఫిక్సింగ్ అనీ, శ్రీలంక జట్టు వరల్డ్ కప్ అమ్మేసుకుందనే ఆరోపణలు వస్తుంటే ఒక భారత జట్టు అభిమానే కాదు సగటు క్రికెట్ అభిమాని కూడా ‘ఔనా ఇది నిజమా’ అని ఆవేదన చెందుతున్నాడు. తొమ్మిదేండ్ల క్రితం ముగిసిన ఈ ఫైనల్ మ్యాచ్‌పై శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద ఫిక్సింగ్ ఆరోపణలు చేసి తేనె తుట్టను కదిలించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. భారత జట్టు సాధించిన గొప్ప విజయాల్లో ఒక దానిపై బురదజల్లడం ప్రారంభించారు.
గతంలోనూ ఇలాంటి ఆరోపణలే..
ప్రస్తుతం వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలు ఇవ్వాళే కొత్తగా వచ్చినవి కావు. మూడేళ్ల క్రితమే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ ఇలాంటి ఆరోపణలే చేశారు. అప్పట్లోనే తన ఫేస్‌బుక్ వాల్‌పై ఒక వీడియో పోస్టు చేశారు. వాంఖడే స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను ఆశ్చర్యపరిచిందని ఆ వీడియోలో అన్నాడు. ‘ఆ సమయంలో తాను కామెంటరీ బాక్సులో ఉన్నాను. శ్రీలంక పటిష్ట స్థితిలో ఉండి కూడా అలా ఓడిపోవడం వెనుక ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు ఆ విషయాలన్నీ నేను బయటపెట్టలేను. కానీ ఏదో ఒక రోజు ఈ మ్యాచ్‌పై విచారణ జరపాల్సి ఉంటుంది’ అని ఆ వీడియోలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘నేను శ్రీలంక ఆటగాళ్ల పేర్లు చెప్పను కానీ ఆటగాళ్లు తమ చేతికి అంటిన బురదను ఎంతో కాలం దాచుకోలేర’ని వ్యాఖ్యానించాడు. అయితే, అర్జున రణతుంగ చేసిన ఆరోపణలపై టీం ఇండియా ప్రపంచకప్ జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, ఆశీష్ నెహ్రాలు ఖండించారు. దమ్ముంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది.
తాజాగా లంక మాజీ మంత్రివీ ఇవే ఆరోపణలు
2011 ప్రపంచ కప్ జరిగిన సమయంలో శ్రీలంక క్రీడా మంత్రిగా ఉన్న మహిందానంద తాజాగా, ఆ మ్యాచ్ ఫిక్సయ్యిందని ఆరోపించారు. శ్రీలంక జట్టు ప్రపంచ కప్‌ను అమ్మేసుకుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనకు అప్పుడే ఈ విషయం తెలిసినా దేశం పరువు పోతుందని బయటకు చెప్పలేదని అన్నారు. కాగా, మహిందానంద ఆరోపణలపై శ్రీలంక మాజీ క్రికెటర్లు మహేల జయవర్ధనే, సంగక్కర విరుచుకపడ్డారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. అయితే ఈ విషయంలో వీరిద్దరూ ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని మహిందానంద వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
విచారణకు ఐసీసీ, బీసీసీఐ ముందుకొస్తాయా..?
వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్‌పై తీవ్రమైన ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వ స్పందించారు. 2011 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీకి అప్పట్లో డిసిల్వ చైర్మన్‌గా ఉన్నారు. ఒక మ్యాచ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం మంచిది కాదని, వెంటనే దర్యప్తు చేసి అభిమానుల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఐసీసీ, బీసీసీఐతో పాటు శ్రీలంక క్రికెట్ కూడా ఇందుకు సహకరించాలని కోరారు. ‘2011 వరల్డ్ కప్ ఫైనల్స్ ఎంతో మంది ఆటగాళ్లకు మధురానుభూతిని మిగిల్చింది. సచిన్ వంటి లెజెండ్‌కు తన కెరీర్‌లోనే ఒక మధురమైన జ్ఞాపకం. కోట్లాది మంది భారతీయులు ఆనందించిన రోజు. అలాంటి మ్యాచ్‌పై నిరాధార ఆరోపణలు తగవు. వెంటనే దర్యాప్తు చేయాలి’ అని డిసిల్వ అన్నారు. అయితే, ఈ దర్యాప్తునకు ఐసీసీ, బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఐసీసీలోని యాంటీ కరప్షన్ యూనిట్‌కు తగిన ఆధారాలు సమర్పిస్తే దర్యాప్తు ప్రారంభిస్తుంది. అంతేకాని నిరాధారంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాటిపై దర్యాప్తు చేయదని ఒక ఉన్నతాధికారి చెప్పారు. కాగా, బీసీసీఐ మాత్రం ఈ విషయంపై స్పందించడానికి సిద్దంగా లేదు.