‘యాంటీ స్మోగ్ గన్స్’తో కాలుష్యానికి చెక్

by Anukaran |   ( Updated:2020-10-09 08:31:00.0  )
‘యాంటీ స్మోగ్ గన్స్’తో కాలుష్యానికి చెక్
X

దిశ, వెబ్‌డెస్క్‌: మనదేశంలో వాయుకాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందర ఓ వెహికల్ పోతే దుమ్ము రేగి వెనక వెహికల్ వాళ్లకు రోడ్డు కూడా సరిగ్గా కనిపించని స్థితిలో మన రోడ్లు ఉన్నాయి. ఇక మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు కాలుష్యం కూడా తోడవుతుంది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో నగరాల్లో చేపట్టే భవన నిర్మాణాల వల్ల మరింత వాయు కాలుష్యం ఏర్పడుతోంది. దీనికి చెక్ చెప్పేందుకు ఢిల్లీలో ‘యాంటీ స్మోగ్ గన్స్’ వచ్చాయి.

మెట్రో నగరాల్లొ నిరంతరం భవన నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. దాంతో దుమ్ము, ధూళి గాల్లోకి చేరి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. దీన్నినియంత్రించడానికి యాంటీ-స్మోగ్ గన్స్‌ను ఢిల్లీ సర్కారు ఉపయోగిస్తోంది. చూడ్డానికి ఫిరంగుల్లా కనిపించే వీటిని చిన్న సైజు ఫైర్ ఇంజన్లుగా చెప్పొచ్చు. 100 మీటర్ల దూరం వరకు ఇవి నీటిని విరజిమ్ముతాయి. దాంతో ఆ ప్రదేశంలో ఉన్న దుమ్ము, ధూళి కణాలన్నీ తడిచి అక్కడే ఉండిపోతాయి. భారీ నిర్మాణ సముదాయాలు, రోడ్డు నిర్మాణ సైట్లు, మైనింగ్ సైట్లు, భవనాలు కూల్చివేసే సమయంలో కూడా ఈ గన్స్ ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. దీంతో ఢిల్లీలో 20వేల చదరపు మీటర్లకన్నా ఎక్కువ ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్న ప్రతి సైట్లోనూ యాంటీ-స్మోగ్ గన్ ఉపయోగించడం తప్పనిసరి అయింది. ఇప్పటికే పది నిర్మాణ సైట్లలో వీటిని ఉపయోగిస్తున్నారు. మరో 39 భవన నిర్మాణ ప్రాంతాల్లోనే వీటిని ఉపయోగించనున్నారు. అయితే, ఢిల్లీ అధికారులు రోడ్ల మీద కూడా దుమ్ము లేవకుండా నీళ్ల ట్యాంకర్లతో రోడ్లను తడుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed