డిస్కంలకు త్వరలో మరో ఉదయ్…?

by Shyam |
డిస్కంలకు త్వరలో మరో ఉదయ్…?
X

దిశ,హైదరాబాద్ బ్యూరో… రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం)లను సంస్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో నూతనంగా రాబోయే కేంద్ర ప్రభుత్వ స్కీంలో చేరనుందా..ఇప్పటికే కేంద్రం డిస్కంలను సంస్కరించడానికి ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన(ఉదయ్)తో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో కొత్త స్కీంపై కేంద్రం సమాలోచనలు చేస్తోందా….అంటే అవుననే అంటున్నాయి తాజాగా కేంద్రం, రాష్ట్ర విద్యుత్ శాఖల్లో జరుగుతున్న పరిణామాలు. డిస్కంలను సంస్కరించడానికి కేంద్రం ఆదిత్య (అటల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ యోజన) అనే పేరుతో కొత్త స్కీం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈస్కీంలో భాగంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలకు గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉదయ్ స్కీంలోలాగా డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసి వదిలేయడం కాకుండా ఆదిత్యలో డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడమే లక్ష్యంగా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. అయితే ఆదిత్య పథకంలో చేరడం చేరకపోవడం అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయా డిస్కంలకు కేంద్రం వదిలిపెట్టనుంది. ఈ పథకంలో అన్నింటికంటే ముఖ్యమైనది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు కస్టమర్లకు అందించి వారు వాడే విద్యుత్ కు సంబంధించిన బిల్లులు మొబైల్ బిల్లుల్లాగా ముందే వసూలు చేయడం. దీని ద్వారా డిస్కంలు కరెంటు కొనడానికి ముందుగా అప్పు చేసి వడ్డీలు కట్టలేక భారీ నష్టాల పాలయ్యే పరిస్థితి ఉండదనేది అంచనా.
ఢిల్లీలో తెలంగాణ అధికారుల సమాలోచనలు…
ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్ స్కీంలో చేరి రూ. 8వేల కోట్ల విద్యుత్ బాండ్లు విడుదల చేసి అప్పు మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆదిత్య స్కీంపైనా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ విద్యుత్ శాఖ, ట్రాన్స్‌కో అధికారులు ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తరచూ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కీంలో చేరాలంటే పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలకు బకాయిలు క్లియర్ చేయడం లాంటి కేంద్రం పెట్టే షరతులకు రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు సిద్ధపడాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Next Story