హవ్వా.. వారికి టికెట్లా..! ఎలాగైనా ఓడిస్తామంటున్న నెటిజన్లు

by Shiva |
హవ్వా.. వారికి టికెట్లా..! ఎలాగైనా ఓడిస్తామంటున్న నెటిజన్లు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీట్లు సాధించిన మహాసేన రాజేష్, అమరావతి దళిత జేఏసీ నేత కొలికిపూడి శ్రీనివాసరావులు అదే సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వీరికి అసెంబ్లీ టికెట్లా ఓడించి తీరుతాం.. అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై విపరీతంగా పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. మహాసేన రాజేష్‌కు అమలాపురం పార్లమెంటు పరిధిలోని పి.గన్నవరం సీటును, కొలికిపూడి శ్రీనివాసరావుకు విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు సీటును టీడీపీ ఇచ్చింది. వీరిద్దరికీ సీట్లు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా నెగిటివ్‌గా స్పందించడం ప్రారంభించింది.

హిందూ మత, కాపు వ్యతిరేకి రాజేష్‌ను ఓడిస్తాం

హిందూ మత వ్యతిరేకి, కాపు కుల వ్యతిరేకి, పవన్ కళ్యాణ్‌ను దారుణంగా దూషించిన మహాసేన రాజేష్‌ను ఓడించి తీరుతామంటూ బీజేపీ, జనసేన యాక్టివిస్టులు, బ్రాహ్మణ, కాపు కులస్తులు బహిరంగంగానే పోస్టింగులు పెట్టారు. హిందూ యువతులను బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకొంటే రూ.లక్ష బహుమతి ఇస్తానంటూ గతంలో రాజేష్ చేసిన ప్రకటన వీడియోలను జత చేశారు. రాజేష్ లాంటి హిందూ ద్రోహులకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశంతో బీజేపీ కలవకూడదని డిమాండ్లు చేశారు. పౌరుషం వున్న హిందువులంతా రాజేష్‌ను ఓడించి తీరాలని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్‌ను చెప్పలేని విధంగా బూతులు తిట్టిన రాజేష్‌కు జనసేనకు గట్టి బలం ఉన్న పి.గన్నవరం కేటాయిస్తుంటే ఎలా ఒప్పుకొన్నావ్ అన్నయ్యా.. అంటూ జనపైనికులు ఏకంగా పవన్‌నే ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశంకు 45 వేల ఓట్లు వస్తే, జనసేనకు 36 వేల ఓట్లు వచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు. మీరేం చెప్పినా జనసేన ఓట్లు రాజేష్‌కు వేసేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

కొలికిపూడి తిరువూరులో ఒంటరి.. పట్టించుకొనే వారేరీ?

తిరువూరు అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడి తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లిన కొలికిపూడి శ్రీనివాసరావును నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జనార్ధన్ అసలు గుర్తు పట్టలేదు. పట్టించుకోలేదు. తిరువూరు అభ్యర్థిగా ఎంపికైన ఆయన వినూత్నంగా ప్రచారం చేద్దామని సంకల్పించారు. ఆదివారం తిరువూరులో ఒంటరిగా సైకిల్ తొక్కుకొంటూ తిరిగితే ఆయనను ఎవ్వరూ గుర్తు పట్టలేదు. పెద్దగా పట్టించుకోలేదు. ఒక రకంగా తిరువూరులో తొలి రోజే ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. తిరువూరులో ఒంటరిగా తిరుగుతున్న కొలికిపూడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరువూరులో తెలుగుదేశం దుస్థితి ఇది అంటూ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. గతంలో ఒక టీవీ డిబేట్‌లో బీజేపీ రాష్ర్ట నేత విష్ణువర్ధన్‌రెడ్డిని చెప్పుతో కొట్టిన శ్రీనివాసరావుకు ఓటు ఎలా వేస్తామంటూ బీజేపీ కార్యకర్తలు, హిందూ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.

వీరిద్దరి విషయంలో పునరాలోచన చేయండి: బీజేపీ

బీజేపీకి, హిందూ మతానికి బద్దవ్యతిరేకులైన మహాసేన రాజేష్, కొలకిపూడి శ్రీనివాసరావుల విషయంలో పునరాలోచన చేయాలంటూ రాష్ర్ట బీజేపీ తెలుగుదేశం పార్టీని కోరనుంది. పొత్తులతో కలసి పనిచేయాలంటూ అందరికీ అమోదయోగ్యమైన అభ్యర్థులు ఉండాలని, పొద్దున లేచిన దగ్గర నుంచి తమపై విషం కక్కేవారికి సీట్లు ఇస్తే తమ ఓటు ఎలా బదిలీ అవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed