AP News:‘సీఎం చంద్రబాబు ఆలోచన ఇదే’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘సీఎం చంద్రబాబు ఆలోచన ఇదే’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలోని అనంతవరంలో మంత్రి నారాయణ ఈరోజు(మంగళవారం) పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని.. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

ఈ క్రమంలో అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు CRDAకు కేటాయించిందన్నారు. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయేకు కేటాయించారు. అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారు. ప్రస్తుతం ఇక్కడ భూమిని కూడా ఏదోక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నాం. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది లక్ష్యమని అన్నారు.

ఎయిర్ పోర్ట్ కోసం కనీసం 5 వేల ఎకరాల ల్యాండ్ అవసరం ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30 వేల ఎకరాలు అవసరం. భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధర పై రెండున్నర రెట్లు మాత్రమే వస్తుంది. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వెల్లడించారు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం. రాజధానిలో 92 పనులను 64,912 కోట్లతో చేస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం మంత్రి, సీఆర్డీయే, మైనింగ్ శాఖల అధికారులు కొండలను పరిశీలించారు.



Next Story