జవహర్‌రెడ్డి భూ దోపిడీ గ్యాంగ్‌పై వేటు? ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందం

by Shiva |
జవహర్‌రెడ్డి భూ దోపిడీ గ్యాంగ్‌పై వేటు? ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూత్రధారిగా, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున సహకారంతో జరిగిన రూ.వేల కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణంపై త్వరలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వం అప్పుడే దృష్టి సారించింది. ఈ వ్యవహారాల్లో సీఎస్‌కు సహకరించి, పనులు చేసిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. జవహర్‌రెడ్డి, మల్లిఖార్జు‌న్‌లది కడప కాగా, సాయికాంత్ వర్మ కర్నూలు జిల్లాకు చెందిన వారు. సీఎస్ బ్రోకర్లుగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిలోక్, భరత్ సుభాష్‌ల లావాదేవీలు, కంపెనీలు, కాల్ డేటా వివరాలను సేకరించే పని అప్పుడే ప్రారంభమైంది.

ఇక్కడ వ్యవహారం.. బెంగుళూరులో ఆస్తులు

తన బాస్ జవహర్ రెడ్డికి ఆయన అనుచరులకు విశాఖ, విజయనగరం జిల్లాల్లో 800 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ బదిలీ చేయించడంలో కీలక పాత్ర పోషించిన విశాఖ జిల్లా కలెక్టర్ ఈ లావాదేవీల్లో తన వాటాగా వచ్చిన రూ.కోట్ల రూపాయలతో బెంగుళూరులో భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు రావడంతో వాటిపై దృష్టి సారిస్తున్నారు. మల్లిఖార్జున తన సతీమణిని బెంగుళూరు పంపి ఆ డీల్స్ చేశారంటూ అందుతున్న సమాచారం ఆధారంగా ఎవరి పేరిట ఆస్తులు కొనుగోలు చేశారో అన్న వివరాలను రాబట్టే పనిలో ఉన్నట్లు తెలిసింది. విశాఖలో మల్లిఖార్జున చేతుల మీదుగా రూ.10 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రభుత్వ భూములు వైసీపీ నేతల పరమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దసపల్లా నుంచి హయిగ్రీవ, సీ‌బీ‌సీ‌ఎన్‌సీ వంటి వివాదాస్పద భూములను ప్రభుత్వం నుంచి విముక్తి చేసి ప్రైవేటు పరం చేసిన అప్రతిష్ట మల్లిఖార్జున్‌పై ఉంది. విశాఖ బీచ్‌లో ఎవ్వరికీ చెప్పకుండా ఆయన రూ.2 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి రెండో రోజే కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

జవహర్‌కు డ్రైవర్‌గా జీవీఎంసీ కమిషనర్

మే 20న విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జవహర్ రెడ్డికి సాటి ఐఏఎస్ అధికారి అయిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ డ్రైవర్ ఉద్యోగం చేయడం ఇఫ్పుడు చర్చనీయాంశమైంది. తన డ్రైవర్‌ను కారులో నుంచి దింపేసిన జవహర్ రెడ్డి భూలావాదేవీల గురించి మాట్లాడేందుకు సాయికాంత్ వర్మ ను డ్రైవింగ్ చేయమనగా ఆయన ఆ పని చేశారు. జీవీఎంసీ కమిషనర్‌గా సాయికాంత వర్మ వచ్చిన తరువాత పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకొన్నారు. విశాఖ వాసులను ఎంతగానో బాధించిన టైకూన్ జంక్షన్‌లోని ట్రాఫిక్ సమస్య ఆయన సృష్టించిందే. జీవీఎంసీ కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కమీషన్లు ఇచ్చే వారికే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పరిధిలో ఆయన ప్రమేయంతో జరిగిన భూ లావాదేవీలపై కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

బ్రోకర్లకు బిగుస్తున్న ఉచ్చు

జవహర్ రెడ్డి బ్రోకర్లుగా భూముల రిజిస్ర్టేషన్లు చేయించుకొన్న త్రిలోక్‌, భరత్ సుభాష్ ల వివరాలను ప్రత్యేక బృందం సేకరిస్తోంది. ఏయే కంపెనీల పేరిట భూములు కొనుగోలు చేశారు? ఎక్కడ నుంచి నిధులు వచ్చాయి? ఎవరెవరితో వీరు నిత్యం మాట్లాడుతున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ భూముల రిజిస్ర్టేషన్లకు అవకాశం కల్పించిన 596 జీవోను రద్దు చేయడంతోపాటు, ఈ జీవో కింద జరిగిన లావాదేవీలను అబయన్స్‌లో పెడతారని తెలుగుదేశం నేతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story