Eluru: ఆలస్యంగా వెలుగులోకి కిడ్నీ రాకెట్.. మహిళలను ఎంత మోసం చేశారో తెలుసా?

by srinivas |   ( Updated:2023-06-30 11:07:39.0  )
Eluru: ఆలస్యంగా వెలుగులోకి కిడ్నీ రాకెట్.. మహిళలను ఎంత మోసం చేశారో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి ముప్పు తిప్పలుపడ్డారు. పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముతున్నా ఎలాంటి లాభం రావడం లేదు. అప్పులోళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో తన వద్దకు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తికి తన కష్టాలు చెప్పుకుని విలపించారు. ఎక్కడైనా అప్పు ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. దీంతో ఉదయ్ కిరణ్ బ్రోకర్ ప్రసాద్ ద్వారా ఆమె కిడ్నీ అమ్మేందుకు బేరం తీసుకువచ్చారు. రూ.7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని తీరా చేతిలో రూ.5 లక్షలు పెట్టి ముఖం చాటేశారు. మరోవైపు ఆమె ఆధార్ కార్డు డిటైల్స్ సైతం మార్చేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరమైంది. కిడ్నీని కోల్పోవడంతో అనారోగ్యం పాలైన బాధిత మహిళ తనను ఆదుకోవాలని పోలీసులను కోరారు. ఏలూరులో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏలూరు వన్ టౌన్ పరిధి హోటల్ సితార దగ్గర మహిళ కూరగాయల వ్యాపారం చేశారు. అప్పులపాలవ్వడంతో వాటిని తీర్చేందుకు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని కలిసి తన గోడు వెళ్ల బోసుకున్నారు. అయితే ప్రసాద్ అనే బ్రోకర్‌ను ఉదయ్ కిరణ్ కలిసి ఆమె వద్దకు వెళ్లారు. కిడ్నీ అమ్మితే రూ.7లక్షలు ఇస్తారని, దీంతో అప్పులు తీరిపోవడంతోపాటు ఇద్దరు పిల్లల పరిస్థితి బాగుంటుందని నమ్మించారు. దీంతో కిడ్నీ అమ్మేందుకు ఆమె అందుకు ఒప్పుకున్నారు. కిడ్నీ అమ్మకం నిమిత్తం రూ.5లక్షలు అప్పగించి అనంతరం ఆపరేషన్ చేశారు.


అయితే ఆ రూ.5 లక్షలలో ఒక లక్ష ఆస్పత్రిలోనే ఖర్చు అయిపోయింది. కిడ్నీ అమ్మేసిన తర్వాత ఆమె అనారోగ్యం పాలయ్యారు. అంతకు ముందు వచ్చే పింఛన్ కూడా రావడం లేదు. ఇంటి లోన్ డబ్బులు కూడా పడకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సచివాలయం వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించారు. అయితే ఆధార్‌లో అడ్రస్ మొత్తం మార్చేయడంతో ఆమె ఖంగారు పడ్డారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో ఆధార్‌లో మార్చేసి కిడ్నీ అవసరమై వ్యక్తికి భార్య అనిచూపేలా ఆమె ఇంటి పేరును యర్రంశెట్టిగా మార్చేయడాన్ని గమనించారు. యర్రంశెట్టిగా మార్చేయడంతో ఆమెకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని వారు తెలపడంతో తల్లితో కలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆధార్‌లో పేరు మార్పుతో ప్రభుత్వ పథకాలు రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కిడ్నీ అమ్మకం రూ.7లక్షలు ఒప్పందం చేసుకోగా కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన సొమ్ము కూడా ఇప్పించాలని కోరారు.


అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు సీఐ బోణం ఆదిప్రసాద్ వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అసలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిబంధనలకు లోబడి జరిగిందా?...ఆ దళారులు ఎవరు?వారి పాత్ర ఏంటి? అసలు ఏమిజరింగింది ? ఆనేదానిపై ఉన్నత అధికారుల అదేశాల మేరకు అన్నికోణాల్లో విచారణ చేపట్టినట్లు సీఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed