అధిష్టానంతో సత్సంబంధాలు.. బీజేపీ, జనసేన అభ్యర్థిగా బరిలో వేమా..?

by srinivas |
అధిష్టానంతో సత్సంబంధాలు.. బీజేపీ, జనసేన అభ్యర్థిగా బరిలో వేమా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు పలు అంశాలను బేరీజు వేసుకుని పోటీ చేసే యోచనలో పడ్డారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కారణమైన అంశాలు..ఓటమికి గల కారణాలపై పార్టీలు పోస్టుమార్టం చేసుకుంటున్నారు. అయితే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గం అన్ని పార్టీలను ఆదరించింది. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందాయి. దీంతో ఈ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టంకట్టబోతుంది.. ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈసారి ఈ నియోజకవర్గంపై బీజేపీ కన్నేసింది. జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టికెట్ బీజేపీకే ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ గెలుపొందింది. ఇప్పుడు అవే సమీకరణాలు పి. గన్నవరం నియోజకవర్గానికి కూడా కలిసి వస్తాయనే తెలుస్తోంది. అసలు ఏ సమీకరణాలు కలిసివస్తాయో ఓ సారి చూద్దాం.

ఏ పార్టీ గెలుపొందితే ఆ పార్టీదే అధికారం

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గం విభిన్నమైనది. ఈ నియోజకవర్గం ప్రజలు తీర్పు అత్యంత భిన్నంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు గెలుపొందాయి. ఒకప్పుడు నగరం నియోజకవర్గంలో పి.గన్నవరం ఉండేది. అయితే నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి గెలుపొందారు. అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తి గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు గెలుపొందారు. ఇలా ఒక్కో ఏడాది ఒక్కో పార్టీని గెలిపిస్తోంది ఈ నియోజకవర్గం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి జనం పట్టంకడతారా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే టీడీపీ అభ్యర్థి గెలుపొందినప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారా అన్న చర్చ జరుగుతుంది.

టీడీపీ, జనసేనలకు అభ్యర్థి కరువు

అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు వైసీపీ మళ్లీ టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతుంది. కానీ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక టీడీపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారు. వైసీపీ రేసులో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎంపీ చింతా అనురాధ లేదా ఆమె భర్త, కారెం శివాజీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పినిపే విశ్వరూప్ మరోసారి అమలాపురం నుంచి పోటీ చేస్తే పోటీగా టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు అక్కడ పోటీ చేస్తారని తెలుస్తోంది. దీంతో టీడీపీకి కూడా అభ్యర్థి కరువయ్యారు. అయితే బీజేపీ నుంచి మాత్రం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా పోటీ చేస్తారనే తెలుస్తోంది. ఇప్పటికే మానేపల్లి అయ్యాజీవేమా గతంలో నగరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టికెట్ తనకే దక్కుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

బరిలో వేమా

మానేపల్లి అయ్యాజీవేమా గతంలో నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా వేమా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు నియోజకవర్గం అభివ‌ృద్ధికి విశేషంగా కృషి చేశారు. డొక్కా సీతమ్మ అక్విడెక్ట్, పి.గన్నవరంలో ప్రధాన ఆస్పత్రి నిర్మాణం వంటి ఇతర కీలకమైన పనులు చేపట్టారు. అలాగే బీజేపీతోపాటు టీడీపీలోనూ ఆయన ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సొంత సామాజిక వర్గమైన ఎస్సీలలోనూ ప్రత్యేక వర్గం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అయ్యాజీవేమా పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా వేమాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వేమాకు ఉన్న ప్రత్యేక వర్గం గెలుపులో కీలక పాత్ర పోషిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మానేపల్లి అయ్యాజీవేమాకు బీజేపీ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. నగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో తన మార్క్ పాలన చేశారని ఈ నేపథ్యంలో మానేపల్లి అయ్యాజీవేమాకు అన్ని పార్టీల మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed