నెరవేరనున్న సీమవాసుల చిరకాల స్వప్నం.. స్టీల్ సిటీగా మారనున్న కడప

by sudharani |   ( Updated:2023-02-15 11:11:37.0  )
నెరవేరనున్న సీమవాసుల చిరకాల స్వప్నం.. స్టీల్ సిటీగా మారనున్న కడప
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాయలసీమ వాసుల ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు కలలు కన్న స్వప్నం స్టీల్‌ప్లాంట్‌ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని దాంతోపాటు చుట్టు పక్క అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు చదువుకున్న మన పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.8,800 కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుందని..30 నెలల్లోపు స్టీల్‌ ప్లాంట్‌ తొలి దశ పూర్తవుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌, జిందాల్‌ కంపెనీ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు భూమి పూజ చేసినట్లు సీఎం తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఆదేశాల మేరకు మీటింగ్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు.

రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి

భూమి పూజతోఎప్పటినుంచో మనం కలలు కన్న స్వప్నం సాకారమవుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ వస్తే నగరాలు నగరాలు ఎలా మారిపోతాయో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలే మనకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. జిల్లాకు జిల్లాలే అభివృద్ధి బాటలో నడుస్తాయని చెప్పుకొచ్చారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ తీసుకురావాలని దివంగత సీఎం వైఎస్ఆర్ కలలుకనేవారని ఆయన కలను నేడు సాకారం చేసినట్లు తెలిపారు. రూ.8,800 కోట్ల పెట్టుబడులతో మొత్తంగా ఈ ప్రాంతంలో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటవుతుందని చెప్పుకొచ్చారు. అయితే రెండు దశల్లో ప్లాంట్ పూర్తి చేసేందుకు జిందాల్ ప్రణాళికలు రూపొందించారని చెప్పుకొచ్చారు. మొదటి ఫేస్‌లో రూ.3,300 కోట్లతో పూర్తిచేస్తారు. రెండో దశ రూ. 5 వేల కోట్లతో ఐదేళ్లలో పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌ మరో 24నుంచి 30 నెలల్లో అందుబాటులోకి వస్తుందని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

స్టీల్ సిటీ ఆవిర్భవించబోతుంది

జిందాల్ కంపెనీ ఈ స్టీల్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. చైర్మన్ సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలో దేశంలోనే అగ్రగామీగా స్టీల్‌ జనరేషన్‌లో జిందాల్ ఉంది. అటువంటి జిందాల్ కంపెనీ 3 మిలియన్‌ టన్నులతో ప్లాంట్‌ ప్రారంభించడం శుభపరిణామం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 'ఈ ప్లాంట్‌కు సపోర్టు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈప్రాంతం సముద్రతీర ప్రాంతానికి దూరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. రూ.40 కోట్లతో మిగిలిన భూములన్నీ కొనుగోలు చేశాం. దాదాపు 3500 ఎకరాలు సజ్జన్‌ జిందాల్‌ కంపెనీకి ఇచ్చాం. దాదాపు రూ.700 కోట్లతో ఇక్కడ ఇన్‌ఫ్రాక్చర్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ పక్కనే ఎకో సిస్టమ్‌ ఏర్పాటవుతుంది. స్టీల్‌ సిటీ కింద ఈ ప్రాంతం ఆవిర్భవించబోతోంది అని సీఎం జగన్ ఆకాంక్షించారు.

75శాతం ఉద్యోగాలు స్థానికులకే

స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి 67వ జాతీయ రహదారిని కలుపుతూ ఏడున్నర కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డును కలుపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ కోసం కొత్తగా 10 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణం జరుగుతోంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతోంది. నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం తలమంచిలిపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి 220 కేవీ లైన్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకమైన ఇన్‌ఫ్రాక్చర్‌ కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మ్యానిప్యాక్చరింగ్‌ క్లస్టర్‌కు 550 ఎకరాలు కేటాయించాం. ఆ క్లస్టర్‌కు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలు వస్తున్నాయి.

అక్కడ లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 11500 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం శర వేగంగా జరుగుతుంది. జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ పేరుతో మరో 3155 ఎకరాలను కూడా కేటాయించాం. అక్కడ రూ.18వేల కోట్లతో పెట్టుబడులు రాబోతున్నాయి. ఫలితంగా లక్ష 75 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. తద్వారా చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే, మన వద్దే ఉద్యోగాలు ఇస్తున్నాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టాన్ని తీసుకువచ్చాం. మన ప్రాంతం బాగుపడాలి..మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఒక్కఫోన్ కాల్‌తో మీ సమస్యకు పరిష్కారం చూపుతానని స‌జ్జన్ జిందాల్‌కు సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Read more:

Sajjala Ramakrishna: అపోహలొద్దు... కట్టుబడే ఉన్నాం

High Court: వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

Advertisement

Next Story

Most Viewed