AP Politics:సానుభూతి కోసం గులకరాయి డ్రామా - కూటమి అభ్యర్థి

by Disha Web Desk 18 |
AP Politics:సానుభూతి కోసం గులకరాయి డ్రామా - కూటమి అభ్యర్థి
X

దిశ ప్రతినిధి,విజయనగరం: తెలుగుదేశం- జనసేన - బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆదివారం సాయంత్రం పట్టణంలో బాలాజీ టెక్స్టైల్ మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అన్ని షాపులకు వెళ్తూ వారిని కలిసి టీడీపీ- జనసేన - బీజేపీ-ఎన్డీయే కూటమికి మద్దతు తెలపాలని, మే 13 న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా వ్యాపారులతో, వినియోగదారులను కలిసి ఓటును అభ్యర్థించడం జరిగింది.

అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ.. ఇది సైకో ప్రభుత్వమని, వ్యాపార రంగాన్ని అతలాకుతలం చేసిన అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో వినియోగదారుల సామర్థ్యం తగ్గి వ్యాపార రంగం దెబ్బతిన్నదని, దీనికితోడు అధిక ధరలతో సామాన్యులను కోలుకోలేని దెబ్బతీసాడని జగన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిపాలన చేయడం చేతకాని జగన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా మరో నాటకానికి తెర తీశారని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ విధంగా డ్రామాలు ఆడటం జగన్ కి అలవాటు అయిందని, గత ఎన్నికల్లో గొడ్డలి వేటు, కోడి కత్తి డ్రామా చేసారని, ఇప్పుడు గులకరాయి డ్రామాతో సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో ప్రజలకు చెప్పుకోవడానికి చేసిన మంచి పనులు ఏమి లేక డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఇటువంటి నాటకాలకు ప్రజలు ప్రతిసారి మోసపోరు అని, నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ సభలకు పోటెత్తుతున్న జన సముద్రాన్ని చూసి దిక్కుతోచని స్థితిలో మళ్లీమళ్లీ పాత స్క్రిప్ట్ నే జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, జగన్ తన సొంత చెల్లెలు ఇద్దరు వివేకానంద రెడ్డి హత్య గురించి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. వీటన్నింటిని ప్రక్కదారి పట్టించడానికే డ్రామాలన్నారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలు ఫిక్స్ అయిపోయారని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమే నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed