ఏపీలో నేడో రేపో మద్యం షాపుల నోటిఫికేషన్.. మాస్టర్ ప్లాన్ వేసిన నేతలు

by srinivas |
ఏపీలో నేడో రేపో మద్యం షాపుల నోటిఫికేషన్.. మాస్టర్ ప్లాన్ వేసిన నేతలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మద్యం షాపుల నోటిఫికేషన్ కోసం కొందరు కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నేడో రేపో మద్యం షాపుల నోటిఫికేషన్ రావచ్చన్న అభిప్రాయంతో రాష్ట్రంలో తుఫాను ప్రభావం లేని ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు... సిండికేట్లు, షాపుల ఖరారులో బిజీ బిజీగా వున్నారు. గతంలో మద్యం వ్యాపారం చేసిన వారంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. పది రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా విజయవాడ కలెక్టరేట్‌లోనే తుఫాను సహాయక చర్యల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో త్వరలోనే మద్యం షాపుల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి తీసుకువచ్చిన సెబ్‌ను రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

తెలంగాణ విధానమేనా?

పక్క రాష్ట్రం తెలంగాణ అవలంబించిన విధానాన్నే అమలు చేసి మద్యం షాపులను పాత పద్ధతిలోనే ప్రైవేటు వ్యక్తులకు లాటరీ ద్వారా అప్పగిస్తారనే సమాచారం ఇప్పటికే వ్యాపారులకు అందింది. ఒక్కో షాపునకు 2 లక్షల రూపాయల వరకూ టెండర్ ఫీజు నిర్ణయించి జోన్ల వారీగా షాపులకు నోటిఫికేషన్ పిలుస్తారనే నమ్మకంతో కీలకమైన ప్రాంతాల్లో షాపులను దక్కించుకొనేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో షాపు కోసం 50కి పైగా టెండర్ల దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారుల అంచనా వేస్తున్నారు.

సిండికేట్లు సాధ్యమేనా?

పలు జిల్లాలలో ఇప్పటికే కీలకమైన వ్యాపారులు ప్రజా ప్రతినిధులతో చేతులు కలిపి మద్యం షాపుల కోసం సిండికేట్లు ఏర్పాటు చేశారు. తమ తమ ప్రాంతాల్లో తామే టెండర్లు దాఖలు చేస్తామని ఇతరులను రానివ్వమని కొందరు చెబుతున్నప్పటికీ అది చాలా చోట్ల సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా పెరిగినందున మద్యం షాపులు దక్కించుకోవడం లాభదాయకమనే అభిప్రాయం కొత్త వారిలో కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ పర్యాయం మద్యం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు టెండర్లు దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి కూడా ఎంత మంది ఎక్కువగా టెండర్లు దాఖలు చేస్తే అంత ఎక్కువగా ఆదాయం రానున్నందున టెండర్ల ప్రక్రియ బెదిరింపులు, దాడులతో సంబంధం లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలని భావిస్తోంది.

తెలంగాణ నుంచి వ్యాపారులు

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించడంతో దశాబ్ధాలుగా ఆంధ్రాలో మద్యం వ్యాపారం చేసిన పలువురు ప్రముఖ వ్యాపారులు తెలంగాణకు వెళ్లిపోయారు. అక్కడ టెండర్లలో పాల్గొని షాపులను దక్కించుకొన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా షాపులు ప్రైవేటుకు ఇవ్వనున్నందున అలాంటి వారంతా తిరిగి ఆంధ్రాకు రావాలని చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed