Pawan Kalyan టీడీపీ సీనియర్ కార్యకర్త: Minister Amarnath

by srinivas |   ( Updated:2023-02-04 11:07:19.0  )
Pawan Kalyan టీడీపీ సీనియర్ కార్యకర్త: Minister Amarnath
X
  • కొడుకు రోడ్డున పడితే.. దత్తపుత్రుడు వెట్టిచాకిరి చేస్తున్నాడు
  • కాపులందరినీ టిడిపికి తాకట్టు పెట్టబోతున్నాడు
  • రాష్ట్రంలోని పరిస్థితులను కాపులు నిశితంగా పరిశీలించాలి
  • - మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు

దిశ, ఉత్తరాంధ్ర: పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. 'యువగళం' పేరుతో చంద్రబాబు సొంత కొడుకు రోడ్డు ఎక్కితే.. దత్తపుత్రుడు పవన్ పార్టీ జెండాలు మోస్తూ వెట్టిచాకిరి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. పెందుర్తి నియోజకవర్గంలో కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు.. పార్టీని స్థాపించిన వారు దానిని సుదీర్ఘకాలం నడపాలనుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ.. వేరే వాళ్ల కోసం నడుపుతున్నాడు" అని అమర్నాథ్ విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ స్థాపించారని, 2019లో అధికారంలోకి వచ్చారని పార్టీ పెట్టిన తర్వాత ఎనిమిదేళ్లపాటు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పోరాటాలు సాగించి ప్రజా బలంతో అధికారంలోకి వచ్చారు.' అన్నారు. అదే పవన్ కల్యాణ్‌కు పార్టీని నడిపే శక్తి, తపన లేదని, కాపులందరినీ తీసుకువెళ్లి తాకట్టు పెట్టాలనుకుంటున్నాడని, అందుకు తాము సిద్ధంగా లేమని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. సినిమాలలో అంతో ఇంతో సంపాదించిన పవన్ కళ్యాణ్ కాపులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అటువంటప్పుడు ఆయనకు కాపులు ఎందుకు ఓటేయాలని నిలదీశారు. 175 స్థానాలకు పోటీ చేయలేని పవన్ కల్యాణ్ ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో? అని ప్రశ్నించారు. కాపులు పవన్ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయంగా, ఆర్థికంగా కాపు సామాజిక వర్గానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిందని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున 31 మంది కాపు అభ్యర్థులు పోటీ చేస్తే 27 మంది గెలిచారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉంటే అందులో ఐదుగురు కాపు మంత్రులని ఆయన పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతను మరువరాదని మంత్రి అమర్నాథ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తామని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇక బీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపబోదని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.

READ MORE

Nellore Politics: దమ్ము, ధైర్యం ఉంటే ప్రమాణం చేద్దాం.. రా..!

Advertisement

Next Story

Most Viewed