‘కూటమి ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి’.. మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-14 14:34:25.0  )
‘కూటమి ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి’.. మంత్రి ఎన్ఎండి ఫరూక్  కీలక వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నంద్యాల సిటీ: పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అక్టోబ‌ర్ 14 నుంచి 20 వ‌ర‌కు 7 రోజుల పాటు జ‌రిగే వారోత్స‌వాలు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న కుంటుంబాల‌కు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామ‌ని వివరించారు. ప‌ల్లెపండ‌గ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలు జ‌రుగనున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం 15వ ఆర్థిక సంఘ నిధుల‌ను విడుద‌ల చేసిందని తెలిపారు.

గత వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక అద్వాన పరిస్థితికి చేరుకుందన్నారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నారు. పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ వివరించారు. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి చాపిరేవుల గ్రామంలో రోడ్లు, కాలువలు ఇతర పనులు శంకుస్థాపన చేయడం జరిగింది . ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు , కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story